Settipalem People Leave Village For one day in Nalgonda District : ఆ గ్రామంలోని ప్రజలు ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలు కోల్పోతున్నారు. గ్రామంలో జరుగుతున్నవి సహజ మరణాలా? అనారోగ్యంతో ప్రాణాలు వదులుతున్నారా? లేక ఏదైనా కీడు వల్ల చనిపోతున్నారా? అనే విషయం తెలియక గ్రామస్థులు తలలు పట్టుకుంటున్నారు. వరుస మరణాలతో బెంబేలెత్తిన ఆ ఊరి వాళ్లు చివరకు ఓ నిర్ణయానికి వచ్చారు. గ్రామాన్ని వదిలి ఊరి బయటకు వెళ్లి చెట్ల కింద కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే రోజంతా గడిపారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో సుమారు 6,000 మంది జనాభా నివాసం ఉంటున్నారు. గత దసరా నుంచి ఇప్పటి వరకు ఏడాది వ్యవధిలో సుమారు 74 మంది వివిధ కారణాలతో మృత్యువాతపడ్డారు. వీరిలో కొందరు అనారోగ్యంతో, మరి కొంతమంది రోడ్డు ప్రమాదంలో, ఇంకొంతమంది వయసు రీత్యా చనిపోయారు. గ్రామంలో ఒకరి తర్వాత మరొకరు మృతి చెందడం, వారిలో యువకులు కూడా అధికంగా ఉండటంతో గ్రామస్థుల్లో అలజడి మొదలైంది. గ్రామంలో జరుగుతున్నవి సహజ మరణాలా? అనారోగ్యంతో ప్రాణాలు వదులుతున్నారా? లేక కీడు వల్ల చనిపోతున్నారా? అనే చర్చ జోరందుకుంది. వరుస మరణాలతో బెంబేలెత్తిన గ్రామస్థులు, చివరకు ఊరికి కీడు సోకిందని భావించారు.
నిర్మానుష్యంగా మారిన గ్రామం : పండితులు, గ్రామ పెద్దల సూచన మేరకు గ్రామాన్ని వదిలి రోజంతా పొలాల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. గ్రామ పెద్దల నిర్ణయాన్ని గౌరవిస్తూ ఊరిలోని ఇళ్లకు తాళాలు వేసుకొని ఊరి శివార్లలో వనవాసానికి వెళ్లారు. గ్రామస్థులు బయటకు రావడంతో శెట్టిపాలెం గ్రామం నిర్మానుష్యంగా మారింది. శెట్టిపాలెం గ్రామంలో గత రెండు నెలల వ్యవధిలో 40 మంది చనిపోయారని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామ పెద్దలు, పండితుల సూచన మేరకు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే పొద్దు పొడవక ముందే నిద్రలేచినదే తడవు ఆరుబయట కల్లాపి చల్లకుండా, పొయ్యి ముట్టించకుండా అందరూ తమ పంట పొలాల దగ్గరికి వెళ్లాలని లేదా ఊరి పొలిమేర అవతలకు తరలివెళ్లి అక్కడే వంటావార్పు చేసుకొని సాయంత్రం తర్వాత గ్రామంలోకి రావాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
దీంతో గురువారం ఉదయాన్నే గ్రామ ప్రజలు మొత్తం ఊరు అవతలికి వన భోజనాలకు తరలివెళ్లారు. గతంలో 50 ఏళ్ల కిందట ఇలానే జరిగిందని, అప్పుడు కూడా తమ తాతలు, పెద్దలు ఇలానే చేశారని, అందుకే తామూ గ్రామాన్ని విడిచి గ్రామ శివారులో ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటి నుంచి అయినా తమ గ్రామానికి కీడు పోయి, మంచి జరుగుతుందని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక కాలంలో ఇలాంటి మూఢ నమ్మకాలు సరికాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.
ఆ గ్రామ ఎన్నికల్లో పోటీ చేస్తే భార్యలు చనిపోతారట! ఎలక్షన్ అంటేనే గజగజ!!