Problems with CM Jagan Siddham Meeting: నాలుగున్నరేళ్ల అరాచక పాలన తర్వాత మరోసారి ఎన్నికల్లో అధికారమే పరమావధిగా సిద్ధం పేరుతో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సభలకు హాజరయ్యేందుకు ప్రజలు విముఖత చూపుతున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభకు వైఎస్సార్సీపీ నాయకులతో పాటు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది జనాల్ని బలవంతంగా తీసుకొచ్చారు.
సీఎం జగన్ ప్రసంగం ప్రారంభం కాకముందే సభకు వచ్చిన వారిలో చాలామంది ఇంటి బాటపట్టారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది. జగన్ ప్రసంగించే సమయానికి వెనుక భాగంలోని గ్యాలరీలు దాదాపు ఖాళీ అయ్యాయి.
సిద్ధం సభతో వైసీపీ విధ్వంసం - సీమ ప్రజల అగచాట్లు ఒకవైపు, మందుబాబుల చిందులు మరోవైపు
సభకు వచ్చిన వారు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు ఎండలో అవస్థలు పడ్డారు. గొంతు తడుపుకోవడానికి తాగునీరు లేకపోవడంతో దాహంతో అల్లాడారు. ముఖ్యమంత్రితోపాటు 300 మంది వైఎస్సార్సీపీ నేతలు కూర్చోడానికి వీలుగా చలువ పందిరి ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతలు నీడలోనా, తాము మాత్రం ఎండలో మాడిపోవాలా అంటూ సభకు వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిద్ధం సభకు తరలించిన వారికి బస్సుల్లోనే బిర్యానీ ప్యాకెట్‌తో పాటు మద్యం సీసా లేదంటే ప్యాకెట్, 500 నోటు చొప్పున ఇచ్చారు. కడప, కదిరి, చిత్తూరు ప్రాంతాల నుంచి సభకు వచ్చిన ప్రజలకు నగదు పంపిణీ చేశారు. కందుకూరు, రాప్తాడు, బొమ్మేపర్తి క్రాస్ ప్రాంతాల్లో కర్ణాటక మద్యంతో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు హల్‌చల్ చేశారు. సభకు తరలివచ్చిన వారికి మద్యం పంపిణీ చేయడంతో చాలమంది రోడ్లు, రహదారుల పక్కనే గుంపులు గుంపులుగా కూర్చొని మద్యం సేవించారు.
భవన నిర్మాణ కార్మికుడు ఒకరు మద్యం మత్తులో ఒక బస్సు బదులు మరో బస్సు ఎక్కి దిగబోతూ ప్రమాదవశాత్తు బస్సు చక్రాల కింద పడగా వెనుక చక్రం కాలిపైకి ఎక్కడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. తమకు మద్యం క్వాటర్ బాటిల్, బిర్యానీ ప్యాకెట్టు ఇచ్చారంటూ ఫూటుగా మద్యం తాగిన కర్నూలు జిల్లా వ్యక్తి కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు.
‘జగన్‌మోహన్‌రెడ్డీ మీ పార్టీ సభలో జనబలాన్ని చూపేందుకు ఆర్టీసీ బస్సుల్ని మళ్లించి ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం’ అంటూ ఓ సామాన్యుడు సీఎంను నిలదీశారు. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం దుద్దేకుంటకు చెందిన పురుషోత్తం బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. బెంగళూరు నుంచి స్వగ్రామానికి బయలుదేరిన ఆయన పావుగడ వద్ద బస్సుల్లేక నిలిచిపోయారు. సీఎం జగన్ సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు తరలించడంతో, బస్సు కోసం ఎంతసేపు నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో, తన ఆవేదనను సెల్ఫీ తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అది కాస్తా వైరలైంది. కిలోమీటర్ల దూరం ప్రయాణించే బస్సుల్ని కూడా ఆపేసి సభకు తరలించడమేంటని ఆయన వీడియోలో నిలదీశారు.
సీఎం పర్యటనకు మహిళలు తరలింపు - అల్పాహారం అందక ఇక్కట్లు
సిద్ధం వేదికకు 20 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు - హైదరాబాద్ మార్గంలో మామిళ్లపల్లి పరిసర ప్రాంతాల నుంచి వాహనాలను మళ్లించారు. కళ్యాణదుర్గం మీదుగా మళ్లించడంతో ఈ రోడ్డు ఇరుగ్గా ఉండి భారీ వాహనాలు వెళ్లేందుకు కష్టంగా మారింది. మళ్లించిన మార్గంలో అదనంగా 120 కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడంతో చాలామంది సభ ముగిసిన తరువాత వెళ్తామని వాహనాలను నిలిపివేశారు. దీంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.
హైదరాబాద్ - బెంగళూరు మార్గంలోనూ సోమలదొడ్డి వద్ద ట్రాఫిక్‌ను బుక్కరాయసముద్రం మీదుగా నార్పల, బత్తలపల్లి, మామిళ్లపల్లి వైపు మళ్లించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బత్తలపల్లి వద్ద ఉదయం నుంచే దుకాణాలను పోలీసులు మూయించడంపై వ్యాపారులు మండిపడ్డారు. మరోవైపు సిద్ధం సభకు వస్తేనే ఉపాధి హామీ పథకం బకాయిలు చెల్లిస్తామని, పనిదినాలు కల్పిస్తామని కుందుర్పి మండలంలోని కొందరు క్షేత్ర సహాయకులు కూలీలను భయపెట్టారు. విధిలేని పరిస్థితుల్లో సభకు వెళ్తున్నట్లు పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని కొందరు కూలీలు ఈ విషయాన్ని తెలిపారు.