Viral fever Cases Rising in Telangana : ప్రజలను వైరల్ జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. దగ్గు, జలుబుతో బాధితుల గొంతు కూడా మారుతోంది. ఎన్నడూ లేనివిధంగా కీళ్ల నొప్పులు విపరీతంగా వేధిస్తున్నాయి. సాధారణంగా జూన్ చివర లేదా జులై మొదటి వారంలో ప్రారంభమై అక్టోబర్ తొలి వారం నాటికి జ్వరాలు తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతం అందుకు భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది తరచూ వర్షాలు కురవడం వల్ల దోమల వృద్ధి విపరీతంగా పెరుగుతోంది. వాటి వల్ల బాధితులు పెరుగుతున్నారే తప్ప, తగ్గడం లేదని వైద్యులు అంటున్నారు. వర్షాల కారణంగా నీరు నిల్వ ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
తీవ్రమైన కీళ్ల నొప్పులు : కొంతమందికి రెండు, మూడు రోజులకు జ్వరం తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. శరీరంలో ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతోంది. రెండు, మూడు వారాలకు పైగా కీళ్ల నొప్పులు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. కొందరు నెల రోజులకు మించి బాధపడుతున్నారు. ఈ లక్షణాలు గన్యా తరహా కేసులను గుర్తు చేస్తున్నాయి. నొప్పుల వల్ల మహిళలు, వయసు పైబడిన వాళ్లు నిటారుగా నిల్చోలేక అవస్థలు పడుతున్నారు. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారైతే అడుగు తీసి అడుగు వేయాలంటే నొప్పులతో సతమతమవుతున్నారు.
ఒకరికి ఫీవర్ వస్తే ఇంట్లో ఉన్న అందరికీ అంటుకుంటోంది. ఈ సమస్యను భరించలేక కరోనా సమయంలో ధరించినట్లు ఇంట్లోనూ మాస్కులు పెట్టుకుంటున్నారు. విడివిడిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వైద్యుల్లోనూ బాధితులు కనిపిస్తున్నారు.
జలుబు, దగ్గుతో తీవ్ర ఇబ్బంది : గతంలో వైరల్ జ్వరం వస్తే మందులు వాడినా, వాడకున్నా 3, 4 రోజుల్లో తగ్గేది. ప్రస్తుతం 7 నుంచి 10 రోజులు ఉంటూ జనాలను సతమతం చేస్తుంది. ఈ సమయంలో సీజనల్ ఫ్లూ సాధారణంగా వస్తుంది. ఇప్పుడు వచ్చే దగ్గు, జలుబు ఎక్కువ రోజులు ఆరోగ్యాన్ని వేధిస్తున్నాయి. ఐదారు రోజుల్లో తగ్గాల్సిన జలుబు రెండు, మూడు వారాలకు పైబడి వెంటాడుతోంది. ఎడతెరపి లేని దగ్గుతో ఎక్కువ మంది గొంతు నొప్పితో బాధపడుతున్నారు. పలువురికి ముక్కు, చెంపలు, కళ్ల కింద నల్లటి మచ్చలు కనిపిస్తున్నాయి.
సాధారణంగా వైరల్ జ్వరం నిర్ణీత కాలంలో దానంతట అదే తగ్గుతుంది. వైరస్ చక్రం ముగింపునకు సమీపిస్తున్న కొద్దీ లక్షణాలు తగ్గుతాయి. ఈసారి కాస్త భిన్న పరిస్థితులు ఉన్నందున వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, తాజా ఆహారం తీసుకుంటూ, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు మందులు వాడాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.