PCC Chief Sharmila fire on Jagan : ' అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది' వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ తీరని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది అసెంబ్లీ మీద అలగడానికో, మైకు ఇస్తేనే పోతానని మారాం చేయడానికో కాదన్నారు. ఇంట్లో కూర్చుని సొంత మైకుల్లో మాట్లేడేందుకు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించలేదని షర్మిల ఆక్షేపించారు.
జగన్ స్వయంకృతాపరాధం ఆయన్ని ప్రతిపక్ష హోదాకు దూరం చేసిందని షర్మిల వ్యాఖ్యానించారు. ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం ఆయన అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై గొంతుక వినిపించే అవకాశం వైఎస్సార్సీపీకి ప్రజలు ఇస్తే, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామనడం సిగ్గుచేటని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
'జగన్ అయినా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలైనా రాజీనామా చేయాల్సిందే'
1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితం అయినా కుంగిపోలేదని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ లాగా ప్రతిపక్ష హోదా కావాలని మారం చేయలేదని తెలిపారు. 26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డామన్నారు. ఎన్నో సమస్యలపై ఆనాడు కాంగ్రెస్ పార్టీ టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించిందని అన్నారు. 2014లో కేంద్రంలో 44 సీట్లకే పరిమితం అయినా, 2019లో 52 సీట్లే వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కోరుకోలేదని తెలియజేశారు.
'జగన్ అసెంబ్లీకి వెళ్లాలి - అధికార పక్షం నిర్ణయాలను ప్రశ్నించాలి'
ప్రతిపక్ష హోదా లేకున్నా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే లు ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారని షర్మిల వివరించారు. మోదీ నియంత పాలన నిర్లక్ష్యాన్ని ఎప్పుటికప్పుడూ ఎండగట్టారని పేర్కొన్నారు. దేశ ప్రజల సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా మారిందని తెలిపారు. ఇప్పటికైనా జగన్ తన పిచ్చితనాన్ని పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్లాలని, కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని సూచనలు చేశారు.
ఆయనగారు అసెంబ్లీకి రారంట - ఇంట్లో కూర్చుని రికార్డు వీడియోలు వదులుతాడంట