PAWAN KALYAN ELECTION CAMPAIGN: రాజకీయ నేతల బూతులు, దాడులకు పన్ను వేస్తే నిధులకు కొరతే ఉండదని జనసేన అధినతే పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. ఇంట్లో ఉన్నవాళ్లను కూడా వ్యక్తిగతంగా దూషిస్తున్నారని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో పవన్‌కల్యాణ్ వారాహి విజయభేరి సభలో ప్రసంగించారు.
జగన్ సర్కార్ డబుల్ డి ప్రభుత్వం అని, దాడులు, దోపిడీలు, బూతులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఒక స్థాయికి వచ్చేసరికి భయపడరని, ఎదురుతిరుగుతారని అన్నారు. స్వేచ్ఛే ఈ దేశానికి వెన్నెముక అన్న పవన్‌కల్యాణ్, జగన్‌ను చూసి, వైఎస్సార్సీపీ నాయకులను చూసి భయపడాలా అని ప్రశ్నించారు. మన నేలను విడిచి ఎక్కడికి పారిపోతామన్న పవన్, మీ గుండెల్లో ధైర్యం నింపడానికే తానొచ్చానని అన్నారు.
మన సభ కోసం స్థలమిచ్చిన రైతుల ఇళ్లు కూల్చారన్న పవన్, మాటిస్తే ప్రాణాలు పోవాలిగానీ వెనక్కి తీసుకోకూడదన్నారు. వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెప్పానన్న, భయపడాలని అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తనకు ముఖ్యమని, స్వేచ్ఛ పోయినరోజు ఎన్ని వేల కోట్లున్నా నిష్ప్రయోజనమే అని అన్నారు. చంద్రబాబు బలమైన నాయకుడు అని, జైలులో ఉన్నా తొణకలేద అని కొనియాడారు.
ఇలాంటి వ్యక్తికి అండగా ఉండాలని ఆనాడే అనుకున్నానని తెలిపారు. 30 కేసులుండి, ఐదేళ్ల నుంచి జగన్ బెయిల్‌పై ఉన్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలన్న పవన్‌కల్యాణ్, వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని ధ్వజమెత్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో ఆస్తులు కాజేయాలని చూస్తున్నారన్న పవన్, మీ ఆస్తులు కాపాడుకోవాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పారు.
ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని దోచుకున్నారన్న పవన్, ఎవరైనా చెరువులు తవ్విస్తారని, వీళ్లు మాత్రం కబ్జా చేశారని ఆరోపించారు. దేవాలయ భూముల్లో కూడా మట్టి తవ్వకాలు చేశారన్న పవన్, మట్టి మాఫియాను అడ్డుకుంటే దాడి చేస్తున్నారని విమర్శించారు. ఏమాత్రం సంకోచించకుండా ఓటు వేయాలని, బూతులు తిట్టేవాళ్లను, గోతులు తవ్వేవాళ్లను సాగనంపాలని పిలుపునిచ్చారు.