Pattikonda YCP MLA Kangati Sridevi Grabbed Land: కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి రూ.4 కోట్ల విలువైన 40 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని బాధితుడు కేవీ కుమార్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. టీడీపీకి చెందిన బీసీ నేతనైనా తనపై కక్ష సాధించడం కోసమే ఆస్తిని కబ్జా చేశారని బాధితుడు ఆరోపించారు. తప్పుడు రిజిస్ట్రేషన్లతో స్థలాన్ని కాజేశారని దీనిపై అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కేవీ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు పంచాయతీ పరిధిలోని ఎమ్మిగనూరు ప్రధాన రహదారికి పక్కనున్న సర్వే నంబరు 93/2లోని 40 సెంట్ల భూమిని తాను 2016లో కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆ భూమిని ఆన్‌లైన్‌లోనూ, అడంగల్ రికార్డులను తన పేరు మీదకి మార్చుకోవడంతో పాటు పాస్‌బుక్ సైతం పొందానని, రైతు భరోసా డబ్బులు జమవుతున్నాయని ఆయన అన్నారు. మొదటగా పూజారి జయలక్ష్మి అనే మహిళ ఆ స్థలాన్ని 1988లో కొనుగోలు చేశారని దానిని అదే సంవత్సరంలో రంగారావు అనే వ్యక్తికి రాసిచ్చినట్లు తెలిపారు. అతని నుంచి స్థలాన్ని కొనుగోలు చేసేందుకు 2011లో ఒప్పందం చేసుకుని 2016లో తాను కొనుగోలు చేసినట్లు కేవీ కుమార్ తెలిపారు.
దుర్గ గుడిలో వైసీపీ నేత తిష్ఠ - అదునుచూసి ఆస్తులన్నీ స్వాహా - YSRCP Leaders Irregularities
అదే స్థలాన్ని మార్కెట్ యార్డ్ మాజీ చైర్ పర్సన్ శమంతకమణి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. రిజిస్ట్రేషన్ కోసం ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో అదికాస్త ఆలస్యం అయింది. కేసు విచారణ జరుగుతుండగానే ఆ భూమిని అధికారులు నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. దీంతో ఆ భూమిని మరొకరు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అవకాశం లేదు. అయినప్పటికీ ఈ ఏడాది జనవరి 19న పూజారి ప్రకాష్ రావు అనే వ్యక్తి 40 సెంట్ల స్థలాన్ని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి, ఆమె అనుచరుడు రఘుపతిరెడ్డికి విక్రయించారు. అతను జయలక్ష్మి కుమారుడు అని, అతని తల్లి చనిపోయిన నేపథ్యంలో ఆ స్థలం అతనికి వారసత్వంగా సంక్రమించిందంటూ పూజారి ప్రకాష్ పత్రాలు చూపారు. ఇందుకోసం జయలక్ష్మి పేరుతో ఒక నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించారు.
వయసులోనే కాదు అవినీతి, అక్రమాల్లోనూ 'పెద్దాయనే' - YSRCP LEADERS LAND ENCROACHMENT
దీనిపై కేవీ కుమార్ ఆరా తీయగా జయలక్ష్మికి అసలు కుమారులే లేరని వెలుగులోకి వచ్చింది. సుజాత అనే మహిళ మరణ ధ్రువీకరణ పత్రాన్ని జయలక్ష్మి మరణ ధ్రువీకరణ పత్రంగా మార్చి రిజిస్ట్రేషన్ అధికారులకు అందించినట్లు తేలింది. ఒరిజినల్ ధ్రువపత్రాలను పరిశీలించకుండా కేవలం ఫొటో కాపీల ఆధారంగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిసి అధికారులను ఆశ్రయించినా అది రద్దు చేసినట్లు లిఖితపూర్వక పత్రాలు ఇవ్వడం లేదు. దీనిపై నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయిస్తే నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భాదితుడు కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తప్పడు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని కేవీ కుమార్ కోరారు.