TIRUMALA TIRUPATI LADDU HISTORY : తిరుపతి అనగానే వేంకటేశ్వరస్వామి రూపం, గోవిందా అనే నామస్మరణ తర్వాత వెంటనే గుర్తుకు వచ్చేది లడ్డూ ప్రసాదం. షుగర్ పేషెంట్లను కూడా ఊరించే ఆ లడ్డూ ఎన్నిసార్లు తిన్నా మళ్లీ మళ్లీ తినాలనుకుంటారు భక్తులు. అద్భుతమైన రుచి, వాసనే అందుకు కారణం. అందుకే తిరుమల వచ్చిన భక్తులు వీలైనన్ని లడ్డూలను కొనుగోలు చేసి బంధుమిత్రులకు పంచి గొప్పగా ఫీలవుతుంటారు. అంతటి నాణ్యమైన లడ్డూ అసలు ఒక్క తిరుపతిలోనే ఎలా సాధ్యం? స్వామివారి ప్రసాదంగా లడ్డూ ఎప్పటి నుంచి అందిస్తున్నారు? అసలు లడ్డూ చరిత్ర ఏమిటో తెలుసుకుందామా!
క్రీ.శ.614 సంవత్సరంలో పల్లవరాణి సమవాయి తిరుమల ఆలయానికి కానుకగా భోగశ్రీనివాసమూర్తి విగ్రహాన్ని సమర్పించారు. పంచబేరాల్లో ఒకటిగా ఉన్న శ్రీనివాసమూర్తికి పల్లవ ప్రసాదం సమర్పించేవారు. అప్పట్లో సప్తగిరులు దాటుకుని తిరుమలకు చేరుకునేవారి సంఖ్య చాలా తక్కువే కాగా, శ్రీ రామానుజాచార్యుల వారి రాకతో ప్రాశస్త్యం పెరిగింది.
స్వామివారి నైవేద్యానికి రెండో దేవరాయల కాలంలో అమాత్య శేఖర మల్లన్న మూడు గ్రామాలను సమర్పించినట్లు తెలుస్తోంది. ఆ గ్రామాల నుంచి వచ్చే ఆదాయంతో నిత్య కైంకర్యాలు, సేవల వివరాలతో సమయ పట్టిక తయారు చేశారు. భక్తులకు ప్రసాదంగా తిరుప్పొంగం, ఆ తర్వాత కాలంలో మనోహరపడి, సుక్కీయం, అప్పం వంటివి సమర్పించేవారు. విజయనగర రాజుల కాలంలో 'అవసరం' అనే ప్రసాదాన్ని ఇచ్చేవారని శాసనాలు వెల్లడిస్తున్నాయి.
1803 సంవత్సరంలో బ్రిటిష్ పాలకుల ఆదేశాల మేరకు ప్రసాదాల విక్రయాన్ని ప్రారంభించగా తీపి ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చేవారని తెలుస్తోంది. అప్పట్లో వడకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో పాటు అవి ఎక్కువ రోజులు నిల్వ వుండేవి. అనంతరం మహంతుల హయాంలో తీపి బూందీ ఇవ్వడం ప్రారంభించారు. ఈ ప్రసాదమే కొంతకాలానికి అత్యున్నత ప్రసాదమైన లడ్డూగా పేరొందింది. 1940 దశకంలో మిరాశీదార్లలో ఒకరైన కల్యాణం అయ్యంగార్ లడ్డూ ప్రసాదం ఇవ్వడాన్ని ప్రారంభించగా భక్తుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఎంతగా అంటే తిరుమల అంటే లడ్డూ, లడ్డూ అంటే తిరుమల అనేంతగా.
సాధారణంగా భక్తులకు దర్శనంతోపాటు ఇవ్వడంతో పాటు అదనంగా కావాలంటే రూ.50 పెట్టి కొనుగోలు చేసేవి మాత్రమే మనకు తెలిసిన లడ్డూలు. కల్యాణోత్సవం లడ్డూ, ఆస్థానం లడ్డూ అని కూడా ఉన్నాయి. పండగలు, తిరుమలలో ఉత్సవాల సమయాల్లో, రాష్ట్రపతి లాంటి అతిముఖ్యమైన అతిథులు వచ్చిన సమయాల్లో వీటిని తయారుచేస్తారు. బరువు 750 గ్రాములు ఉంటుంది.
నిత్యం లక్షలాది భక్తజనం తరలివచ్చే తిరుపతిలో లడ్డూ ప్రసాదం తయారీ, పంపిణీ అంత తేలికేం కాదు. పక్కా కొలతల ప్రకారం లడ్డూ తయారీకి ప్రత్యేకంగా దిట్టం ఉంటుంది. లడ్డూ తయారీలో శనగపిండి, చక్కెర, యాలకులు, ఆవు నెయ్యి, కలకండతోపాటు జీడిపప్పు, ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ ఉపయోగించి కొలతల ప్రకారం తయారు చేస్తారు. ఎంతో విశిష్టత కలిగిన తిరుపతి లడ్డూకు 2009లో జీఐ (భౌగోళిక గుర్తింపు) లభించింది. పేటెంట్ హక్కులు ఉన్నాయి కనుకే టీటీడీ అనుమతి లేకుండా ఈ లడ్డూను మరెవరూ తయారు చేయకూడదు.
తిరుమల ప్రసాదం వడ నుంచి లడ్డూగా ఎలా మారిందంటే? - శ్రీవారికి ఎన్ని నైవేద్యాలు పెడతారో తెలుసా?
తిరుమల లడ్డూకు మళ్లీ నందిని సువాసన! - కిలో నెయ్యి రూ.478 - NANDINI GHEE TO TIRUMALA LADDU
తిరుమలలో పెరిగిన శ్రీవారి లడ్డూ విక్రయాలు - వారం రోజుల్లో ఎన్ని కొనుగోలు చేశారంటే?