Passengers Suffering Railway Authorities Decision in Vijayawada : రైల్వేశాఖ అనాలోచిత నిర్ణయం ప్రయాణికులను కష్టాలపాలు చేసింది. విజయవాడ ప్రధాన స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు శివారు ప్రాంతాల్లో శాటిలైట్ స్టేషన్ల ఏర్పాటు నిర్ణయం మంచిదే అయినా అక్కడి నుంచి నగరంలోకి రావడానికి ఎలాంటి రవాణా ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఇక్కట్ల పాలవుతున్నారు. రైళ్ల సమాచారం లేక కొత్తగా వచ్చిన వారు అయోమయానికి గురవుతున్నారు. ప్రధాన స్టేషన్ నుంచే రైళ్లు నడపాలని కోరుతున్నారు.
రాష్ట్రంలోనే అత్యంత రద్దీ రైల్వేస్టేషన్ విజయవాడ. మూడు ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ ఈ జంక్షన్ మీదుగానే రాకపోకలు సాగించాల్సి ఉంది. రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య, రైళ్ల సంఖ్యతో విజయవాడ జంక్షన్‌పై విపరీతమైన ట్రాఫిక్ ఒత్తిడి పెరుగుతోంది. అందుకే ప్యాసింజర్ రైళ్లను ప్రధాన స్టేషన్ వరకు కాకుండా శివారు స్టేషన్ల వరకే పరిమితం చేస్తున్నారు.
వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విజయవాడకు సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వివిధ పనులపై నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. పొరుగు జిల్లాల నుంచి వేలాది మంది తరలివస్తుంటారు. ఉద్యోగం, కూలి పనులకు వచ్చి పోయేవారి సంఖ్య చెప్పనక్కర్లేదు. వీరందరిని దృష్టిలో ఉంచుకునే రైల్వేశాఖ నరసాపురం, భీమవరం, మచిలీపట్నం తదితర ప్రాంతాల నుంచి విజయవాడకు ప్యాసింజర్ రైళ్లను నడుపుతోంది. రెండేళ్ల క్రితం వరకు ప్యాసింజర్ రైళ్లన్నీ నేరుగా విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్ వరకు రాకపోకలు సాగించేవి. ఇప్పుడు శివారు ప్రాంతాలకే పరిమితం చేయడంతో రామవరప్పాడు స్టేషన్‌లోనే నిలిపివేస్తున్నారు. కనీస రవాణా సౌకర్యాలు కల్పించకుండా రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఆటోలకు వందలాది రూపాయలు చెల్లించి నగరంలోకి రావాల్సి వస్తోందని వాపోతున్నారు.
చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునేవారు, కూలీలు నిత్యం రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి వారు ఆటో ఛార్జీలు భరించలేకపోతున్నారు. రోజూ రానూపోనూ వందరూపాయలపైనే అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు ఛార్జీలు పెరగడంతో పేద, మధ్యతరగతి వారు ప్యాసింజర్ రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు వారంతా ఆందోళన చెందుతున్నారు. రామవరప్పాడు నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యమైనా ఏర్పాటు చేయాలని లేకపోతే ప్రధాన స్టేషన్ వరకు ప్యాసింజర్ రైళ్లను పొడిగించాలని కోరుతున్నారు. గతంలో ప్రయాణికులతో కిటకిటలాడిన ప్యాసింజర్ రైళ్లు రైల్వేశాఖ అనాలోచిత నిర్ణయంతో ఇప్పుడు జనం లేక వెలబోతున్నాయి.
ఓటేసి హైదరాబాద్ బాట పట్టిన జనం -కిక్కిరిసిన మెట్రో, బస్సులు - Voters Returned To Hyderabad