Passengers Suffering Due to Outdated RTC Bus Journey : గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగిపోతున్నాయి. నడిరోడ్డు మీద బస్సు ఆగిపోవడంతో స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 25 ఆర్టీసీ డిపోలకు చెందిన 2,850 బస్సులు నిత్యం 20 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. రోజూ 7.55 లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో చాలా వరకు కాలం చెల్లిన బస్సులు ఉండడంతో బస్సులు రోడ్లపైనే మొరాయిస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. బయలుదేరిన బస్సులు గమ్యస్థానానికి చేరుకుంటుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు.
గ్రేటర్ పరిధిలో 2,850 బస్సులు ఉండగా అందులో 1,850 ఆర్డినరీ బస్సులు, 24 మెట్రో డీలక్స్, 19 సూపర్ లగ్జరీ బస్సులు, 800 మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులు, 111 వరకు ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల్లో ఎక్కువ శాతం ఎప్పుడో కొన్న బస్సులే ఉండడంతో, ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి. సాధారణంగా ఒక బస్సు జీవితకాలం 10.5లక్షల కిలోమీటర్లు లేదా 15 ఏళ్లు నడపాలి. కానీ ఆ కిలోమీటర్లను అవి ఎప్పుడో దాటిపోయినట్లు ఆర్టీసీ వర్గాలే చెబుతున్నాయి. మెట్రో ఎక్స్ ప్రెస్, ఆర్డీనరీ బస్సుల్లో సుమారు 1,000 వరకు డొక్కు బస్సులే ఉన్నట్లు సమాచారం.
RTC Buses Poor Condition : బస్‌భవన్ పక్కన ఖాళీ స్థలంలో కాలం చెల్లిన బస్సులను ఉంచుతున్నారు. అవన్నీ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పుపట్టిపోతున్నాయి. కొన్నింటిలో పిచ్చి మొక్కలు కూడా పెరుగుతున్నాయి. మరోపక్క ఆర్టీసీ కొన్ని కొత్త బస్సులు కొనుగోలు చేసినప్పటికీ వాటికి ఇంకా బాడీలు తయారుచేయలేదు. టీజీఎస్ఆర్టీసీ ఏడాది క్రితం 1,325 బస్సులను కొనుగోలు చేసింది. సొంత యూనిట్లో, ప్రైవేట్ యూనిట్లలో ఛాసీస్‌లకు బాడీ తయారు చేయించి దశలవారీగా రోడ్డెక్కిస్తుంది. వీటిలో ఇంకా దాదాపు 250 బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రావాల్సి ఉందని సమాచారం.
కొత్త బస్సులకు బాడీ నిర్మాణం అయితే అందులో ఎక్కువశాతం జిల్లాలకే పంపిస్తున్నారు. బస్సు తయారీ సంస్థలు ఛాసిస్లనే అందిస్తాయి. బాడీని ఆర్టీసీయే నిర్మించుకోవాలి. ఈ పని చేసేందుకు ఆర్టీసీకి మియాపూర్ లో 12 ఎకరాల స్థలంలో బస్ బాడీ యూనిట్ ఉంది. 1988లో దీన్ని ప్రారంభించారు. అప్పట్లో ఉద్యోగుల సంఖ్య సుమారు 770 మంది వరకు ఉండేది. అప్పట్లో నెలకు 150 నుంచి 180 బస్సుల బాడీలను తయారుచేసేవారు. రిటైర్మెంట్లే తప్ప నియామకకాలు లేకపోవడంతో ఈ యూనిట్లో సిబ్బంది తగ్గిపోయారు. ఉద్యోగుల సంఖ్య మూడేళ్ల క్రితం 300 ఉంటే ప్రస్తుతం 121కి పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో ఆ యూనిట్ సామర్థ్యం నెలకు 25 బస్సుల బాడీ నిర్మాణానికే పరిమితమైనట్లు తెలుస్తుంది. దీంతో ఆర్టీసీ బస్ బాడీల నిర్మాణం కోసం ప్రైవేట్ వర్క్ షాప్‌లపై ఆధారపడాల్సి వస్తుంది.