Parking Problems in Kamareddy : కామారెడ్డి జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో నానాటికీ రద్దీ పెరుగుతోంది. వాహనాలు నడపడం, నిలపడం వాహనదారులకు సమస్యగా మారింది. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో పార్కింగ్ స్థలాలు కరవై సమస్య తలెత్తుతోంది. వాహనాలను రోడ్లపై నిలపడంతో పాదచారులు, వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఆ దిశగా పనిచేయడం లేదు. గతంలో అధికారులు ప్రధాన ప్రాంతాల్లో హడావుడి చేసినా ఆ తర్వాత తీసుకున్న చర్యలేవి లేవని స్థానికులు వాపోతున్నారు.
Traffic Problem in Kamareddy : కామారెడ్డి పట్టణంలో ప్రధాన రహదారుల్లో రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు జరిపారు. పలువురు సెల్లార్‌తో నిర్మిస్తామని అనుమతి తీసుకుని ఆ తర్వాత వాణిజ్య అవసరాలకు వాడుతున్నారు. దీంతో వాహనాలు నిలిపేందుకు స్థలాలు లేక వాహనాలను రోడ్లపైనే నిలపాల్సి వస్తుంది. అంతేగాక ప్రధాన కూడళ్లను విస్తరించాల్సి ఉన్నా స్థలం లేదని అధికారులు వదిలేస్తున్నారని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. ప్రధాన జంక్షన్‌లలో వాహనాల పార్కింగ్ ఎక్కడపడితే అక్కడే పార్క్ చేయడం వలన ఇబ్బంది పడుతున్నాం. ఈ విషయంలోనే ప్రజలు ఇప్పటికే పలుమార్లు అధికారులకు తెలియజేశాం. అధికారులకు రాత పూర్వకంగా కూడా చెప్పాం. అయినా పట్టించుకోలేదు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కనీసం రూల్స్ పాటించకుండా నిర్మించారు. పార్కింగ్‌కు ప్రదేశం లేకుండా చేశారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు అధికం అయిపోతున్నాయి. ఈ సమస్యను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం ఈ సర్కారు అయినా పట్టించుకోని పరిష్కారం కల్పిస్తారని కోరుతున్నాం.- స్థానికుడు
ఇటీవల 100 అడుగుల రోడ్డును 80 అడుగులతోనే సరిపెట్టడం సహా మధ్యలో డివైడర్ నిర్మించడంతో రోడ్డు ఇరుకుగా మారింది. వాణిజ్య ప్రాంతమైన సుభాష్ రోడ్డులో వాహనాలను రోడ్డు మధ్యలో నిలిపి వెళ్తుండటంతో ఆ ప్రాంతం గుండా వెళ్లే ప్రజలు నిత్యం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా పురపాలక శాఖ అధికారులు స్పందించి పార్కింగ్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.