Parents Killed Daughter in Nellore District: నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొడవలూరు మండలం పద్మనాభసత్రం పల్లిపాలెంలో కన్నకుమార్తెను తల్లిదండ్రులు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మాట వినడం లేదని కన్న కుమార్తెను తల్లిదండ్రులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
వెంకటరమణయ్య, దేవసేనమ్మ అనే దంపతులకు శ్రావణి అనే కుమార్తె ఉంది. కుటుంబ కలహాల నేపథ్యంలో శ్రావణి మాట వినడం లేదని ఆమెను హత్యచేసి ఇంటి పక్కనే ఉన్న గడ్డివామిలో పాతి పెట్టినట్లు కొడవలూరు సీఐ సురేంద్రబాబు తెలిపారు. శ్రావణి 20 రోజుల నుంచి కనిపించక పోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా ఈ ఉదంతం బయటపడింది. తహసీల్దార్ సమక్షంలో శ్రావణి మృతదేహాన్ని వెలికితీసి, శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి విషయంలో గొడవలు: గతంలోనే శ్రావణికి పెళ్లి అయినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి విషయంలో శ్రావణికి, తల్లిదండ్రులకు గొడవలు జరిగేవని సమాచారం. దీంతో గత కొన్ని రోజులుగా ఆమె కనిపించడం లేదని తెలుసుకున్న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బంధువులు ఏం అంటున్నారంటే: కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లిదండ్రులు మందలిస్తుండగా తగలరానిచోట తగిలి శ్రావణి మృతి చెందిందని బంధువులు తెలిపారు. ఈ విషయం బయటకు రానివ్వకుండా తల్లిదండ్రులు వెంకటరమణయ్య, దేవసేనమ్మలు కుమార్తె శ్రావణి మృతదేహాన్ని ఇంటి పక్కనే ఉన్న గడ్డివామి వెనక గొయ్యితీసి పాతిపెట్టారు.
"పల్లిపాలెం గ్రామంలో శ్రావణి అనే వివాహిత గత 20 రోజుల నుంచి కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాపు చేశాము. తల్లిదండ్రులతో శ్రావణికి గత కొన్ని రోజులుగా పెళ్లి విషయంలో గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఆమెను ఏమైనా చేసి ఉంటారు ఏమో అని విచారణ చేశాము. అయితే ఆ అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులే వారి మాట వినట్లేదని ఆమెను హత్య చేసి, ఇంటి దగ్గర్లో ఉన్న గడ్డివాము దగ్గర పూడ్చి పెట్టారు. ఈ హత్య ఎవరు చేశారు? ఎవరెవరు సహకరించారు అనే విషయాలను దర్యాప్తులో తెలుసుకుంటాము". - సురేంద్ర బాబు, కొడవలూరు సీఐ