Son Harassing Parents In Hanamkonda : ఈ రోజుల్లో కనిపెంచిన తల్లిదండ్రులను పోషించడానికి భారంగా ఫీలవుతున్నారు పిల్లలు. గుండెల మీద పెట్టుకుని పెంచిన వారికి బుక్కెడు అన్నం పెట్టడానికి మనసు రాక వీధిన పడేస్తున్నారు. కన్న తల్లిదండ్రులని కూడా చూడకుండా వారు సంపాదించిన ఆస్తిపాస్తులను లెక్కలేసుకుని బతుకుతున్నారు. జల్సాలకు అలవాటుపడి, వారు సంపాదించిన ఆస్తులపై కన్నేస్తున్నారు. ఆస్తులు పంచేదాకా వారిని ఏదోరకంగా హింసిస్తున్నారు. కన్న కుమారుడే ఆస్తికోసం తమని బెదిరించడంతో వారి గోడు ఎవరికి విన్నవించుకోవాలో తెలియక ఎందరో తల్లిదండ్రులు నానా కష్టాలు పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే హనుమకొండలో జరిగింది.
తల్లిదండ్రులను వేధిస్తున్న కుమారుడు : హనుమకొండ బాలసముద్రం ప్రాంతానికి చెందిన బిట్ట శేఖర్, భాగ్యలక్ష్మి దంపతులకు ఆరుగురు కుమారులు. ఇద్దరు చనిపోగా నలుగురు ఉన్నారు. వీరిలో ముగ్గురు వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. ఒక్క కుమారుడు మాత్రం వీరిని హింసించడమే పనిగా పెట్టుకున్నాడు. వీరికి ఏకైక జీవనాధారం హనుమకొండ టైలర్ స్ట్రీట్‌లోని నగల దుకాణం.
ఆ దుకాణాన్ని నిర్వహించుకుంటూ తన కుమారులను ప్రయోజకులను చేశారు ఈ దంపతులు. ఈ దుకాణంపై కన్నేసిన కుమారుడు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడు. దీంతో తాము ఎలా జీవనం సాగించాలని తల్లిదండ్రులు ప్రశ్నించగా, సూటిపోటి మాటలతో నిత్యం వేధిస్తున్నాడు. నిలదీసిన తల్లిదండ్రులపై రౌడీలను ఉసిగొల్పుతూ కర్కశత్వాన్ని చాటుతున్నాడు.
కుమారుడి నుంచి తమను రక్షించండయ్యా అంటూ : కన్న కుమారుడే తమను వేధిస్తున్నాడని ప్రజావాణిలో కలెక్టర్‌కు ఆ వృద్ధ దంపతులు చెప్పుకుంటూ బోరున విలపించారు. ఈ ఘటన అక్కడున్న అందరికీ బాధ కలిగించింది. 30 ఏళ్లుగా ఆ దుకాణాన్ని నిర్వహించుకుంటూ కుమారులందరినీ ప్రయోజకులను చేశామని వృద్ద దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు కుమారులు పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఈ కుమారుడు మాత్రం రెండేళ్లుగా తమను తీవ్రంగా వేధిస్తున్నాడని తెలిపారు.
తమ ఏకైక జీవనాధారమైన దుకాణాన్ని దౌర్జన్యంగా లాక్కొని మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తమ గోడును విన్నవించుకున్నారు. తాము రోజూ భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని తెలిపారు. తమ కుమారుడి నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని, నగల దుకాణాన్ని తమకు అప్పగించాలని ఆ వృద్ధ దంపతులు కలెక్టర్‌ను కోరారు.
Mother Complaint: 'అయ్యా.. నా కొడుకులను బుక్కెడు బువ్వ పెట్టమనండయ్యా..'
parents complaint: 'మా కొడుకులు మా భూములు లాక్కొని.. మమ్మల్ని పట్టించుకోవడం లేదు'