Panchayat Funds Diverted in AP: కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం స్థానిక సంస్థలకు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 5 వేల 500 కోట్ల రూపాలను మళ్లించేసింది. వాటిలో పంచాయతీలకు సంబంధించినవే 3వేల 198 కోట్లు ఉన్నాయి. మిగతా 2 వేల 302 కోట్ల రూపాయలు జిల్లా, మండల పరిషత్తులకు ఇచ్చినవి. ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా విద్యుత్ ఛార్జీల బకాయిల పేరుతో వాటిని ఇతర అవసరాలకు జగన్ సర్కార్ మళ్లించింది. ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్ కల్యాణ్ బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో నిధుల మళ్లింపు విషయాన్ని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు పూర్తి వివరాలతో నివేదిక ఇచ్చారు.
గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు ఇచ్చింది. వాటిని గత ప్రభుత్వం దారి మళ్లించటంపై సర్పంచులు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం పంచాయతీల పేరుతో అప్పట్లో బ్యాంకు ఖాతాలు తెరిపించింది. వాటిలోనే నిధులు వేయాలని అప్పటి ప్రభుత్వానికి ఆదేశించింది. అయినా దాన్ని జగన్ పట్టించుకోలేదు. 15వ ఆర్థిక సంఘం 2021-22 నుంచి ప్రారంభమైంది. మధ్యంతర నివేదిక ఆధారంగా ఏడాది ముందు 2020-21 నుంచే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు కేటాయించింది. 2021-22 నుంచి 2023-24 మధ్య నాలుగేళ్లలో గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం 8 వేల 605 కోట్ల రూపాయలు కేటాయించి 8 వేల 527 కోట్లు విడుదల చేసింది.
కేంద్ర మార్గదర్శకాలు ఉల్లంఘన: ఆర్థిక సంఘం నిధుల విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాలను యథేచ్ఛగా ఉల్లంఘించింది. గ్రామాల్లో తాగునీటి సరఫరా మెరుగుకు, పారిశుద్ధ్య పనులకే వాటిని ఖర్చు చేయాలనే ఆదేశాలకు తిలోదకాలిచ్చింది. పంచాయతీల విద్యుత్ ఛార్జీల బకాయిల కోసం వాటిని మళ్లించేసింది. కేంద్ర ప్రభుత్వ విచారణలోనూ ఈ విషయం వెల్లడైంది. ఎన్నికల ముందు 2023-24 సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం 998 కోట్ల రూపాయలు ఇచ్చింది. వాటిని స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్నట్లుగా జగన్ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చి మోసం చేసింది. ఇప్పటికీ అవి జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీల బ్యాంకుల్లో జమ కాలేదు.
కేంద్రం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన రెండు వారాల్లో అవి పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం కానుంది. అలాగే ఉపాధి హామీ కూలీల వేతనాలు కూడా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విషయాన్ని పరిశీలించాలని మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు - పలు దస్త్రాలపై సంతకాలు - Pawan Kalyan Charge as Deputy CM