Palnadu TDP Leaders Comments on SIT Investigation : పల్నాడు జిల్లా మాచర్లలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన కారణమని టీడీపీ నేతలు జూలకంటి బ్రహ్మారెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. ఈ దాడుల్ని కట్టడి చేయటంలో పోలీసులు, ఎన్నికల కమిషన్ విఫలమైందని వారు గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాత టీడీపీ వారిపై దాడులు చేస్తామని పిన్నెల్లి బహిరంగంగా హెచ్చరించిన విషయం తాము ఎన్నికల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ముందుగానే ఫిర్యాదు చేశామని బ్రహ్మారెడ్డి తెలిపారు. ఈసీ కేవలం సమస్యాత్మక ప్రాంతాలను ప్రకటించి మౌనంగా ఉందని తెలిపారు.
సిట్ దర్యాప్తుపై తమనకు పూర్తి నమ్మకం లేదు : పోలీసులు చర్యలు తీసుకోకపోవటంతో ఇష్టారాజ్యంగా దాడులు చేశారని ఆరోపించారు. ఎన్నికలు పూర్తయ్యాక పిన్నెల్లిని పోలీసులు గృహనిర్బంధం చేశారని, అయినా తప్పించుకుని హైదరాబాద్ పారిపోయారని గుర్తు చేశారు. అక్కడ మీడియాతో మాట్లాడినా పిన్నెల్లిపై చర్యలు లేవని, ఆయనపై పోలీసులు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారని, ఆయన ఇంట్లో ఆయుధాలు ఎందుకు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ చేసిన దాడుల్లో 74 మంది ఎస్సీ ఎస్టీ, బీసీలు గాయపడ్డారని అయినా ఇప్పటికీ పిన్నెల్లి కులాల గురించి మాట్లాడటాన్ని తప్పుబట్టారు.
పిన్నెల్లి తన రక్షణ కోసం ఎస్సీ, ఎస్సీ, బీసీ వర్గాలను పావులా వాడుకున్నారని దుయ్యబట్టారు. పిన్నెల్లి అనుచరులు మాచర్లలో వాహనాలతో టీడీపీ వారిని తొక్కించినా, పాల్వాయిలో పోలింగ్ కేంద్రంలోనికి వెళ్లి దాడి చేసినా కేసు ఎందుకు పెట్టలేదని గుర్తు చేశారు. పిన్నెల్లి అరాచకాలపై సిటింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా అన్ని సవాల్ విసిరారు. సిట్ దర్యాప్తుపై తమనకు పూర్తి నమ్మకం లేదని, సీఎస్ కనుసన్నల్లోనే మొత్తం జరుగుతోందని టీడీపీ జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు.
ఈసీని ఆత్మరక్షణలో పడేసేందుకే వైఎస్సార్సీపీ ప్రయత్నం : నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ మే 13న జరిగిన ఎన్నికలను తక్కువ చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రజలు భారీగా తరలివచ్చి వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు 85 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో వైసీపీ తట్టుకోలేక పోతోందని అందుకే వేర్వేరు అంశాలను తెరపైకి తెచ్చిందని విమర్శించారు. వైఎస్సార్సీపీ దాడుల్లో గాయపడిన వారిలో 75 శాతం మందికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని కేవలం టీడీపీ తరఫున ఏజెంట్లుగా ఉండటం, ఓట్లు వేయడం వల్లే వారిపై దాడి చేశారని దుయ్యబట్టారు.
మాచర్ల నియోజకవర్గంలో ముగ్గురు సీఐలు ముగ్గురు ఎస్ఐలు పిన్నెల్లి పుట్టినరోజు వేడుకలకు రావటం అధికార దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. తాను ఎంపీగా ఏనాడు అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఈసీని ఆత్మరక్షణలో పడేసేందుకే వైఎస్సార్సీపీ ప్రయత్నం చేస్తోందని, సిట్ అధికారులకు లేని పోని అంశాల్లో వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేస్తోందని టీడీపీ నేత శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
సిట్ దర్యాప్తులో కీలక విషయాలు- 'స్వామిభక్తి చాటుకున్న పోలీసులు' - SIT investigation