Palle Panduga Program in AP: గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే 'పల్లె పండుగ–పంచాయతీ వారోత్సవాలు' రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. 4 వేల 500 కోట్లు నిధులతో 30వేల పనులు చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధమైంది.
రాష్ట్రంలో మరో భారీ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం నాంది పలికింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను "పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు" పేరిట నేడు ప్రారంభించనున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఆగస్ట్ 23న రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల 326 గ్రామ పంచాయితీల్లో ఒకే రోజున గ్రామసభలు నిర్వహించగా, వరల్డ్ రికార్డ్ యూనియన్ అవార్డు కూడా దక్కింది. అప్పటి సభల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు పల్లె సీమల్లో పనులు చేపడుతున్నారు. మొత్తం 30 వేల పనులు చేపట్టాల్సి ఉంది.
ఎదురు చూస్తున్న పల్లె పండుగ వచ్చేసింది! పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు-బీటీ రోడ్లకు మోక్షం
ఉపాధి హామీ పథకంలో పెండింగ్ ఉన్న కూలీల వేతనాలు 2 వేల 81 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇప్పటికే చెల్లించింది. ఈ ఆర్థిక సంవత్సరం కావలసిన 9 కోట్ల పనిదినాలకు గ్రామ సభల్లో ఆమోదం తెలిపారు. ఆ పనులు చేపట్టేందుకు 4 వేల 500 కోట్ల రూపాయలవుతుందని అంచనా వేశారు. ఉపాధి హామీ కూలీలకు 4 కోట్ల 66 లక్షల 13 వేల పనిదినాలు కల్పిస్తారు. అలాగే 46 వేల 745 ఎకరాల రైతు భూముల్లో ఉద్యాన పంటల మొక్కలు నాటించే పనులు చేపట్టారు. గ్రామసభల తీర్మానాల ఆధారంగా ఉపాధి హామీ పథకం కింద ఇప్పటివరకు 26వేల 715 పనులకు 2 వేల 239 కోట్ల రూపాయలకు జిల్లా కల్లెక్టర్లు పరిపాలన ఆమోదం ఇచ్చారు. మిగిలిన 474 కోట్ల రూపాయల పనులకు త్వరలో పరిపాలన ఆమోదం లభించనుంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో 3 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 65 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు, 25 వేల నీటి కుంటలు, 22వేల 525 గోకులాలు నిర్మించనున్నారు. అలాగే 30 వేల ఎకరాల్లో నీటి నిల్వకు ఉపయోగపడే ట్రెంచులను తవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే 200 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 50 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 53 వేల 257 ఎకరాల్లో హార్టికల్చర్, 11 వేల 512 ఫార్మ్ పాండ్లు, 19 వందల గోకులాలు, 20 వేల 145 ఎకరాలలో ట్రెంచులు పూర్తి చేశారు. మిగతా పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయనున్నారు. పల్లెపండుగ వారోత్సవాల్లో ఉపాధి హామీ పనుల ఉపయోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ప్రతి గ్రామ పంచాయితీలో 2024-25 సంవత్సరంలో చేపట్టబోయే పనులు, పూర్తి చేసిన పనుల వివరాలు తెలియపరిచే సిటిజెన్ నాలెడ్జ్ బోర్డు ఏర్పాటు చేస్తారు.
పల్లె పండుగ కార్యక్రమ నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులు, జిల్లాల కలెక్టర్లతో కొద్దిరోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో 'పల్లెపండుగ–పంచాయతీ వారోత్సవాల్లో' భాగంగా అన్ని రకాల పనులకు భూమిపూజ చేయాలని సూచించారు. శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, సర్పంచులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
"ప్రతి గ్రామంలో సర్పంచ్, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పనులకు సంబంధించిన భూమి పూజ జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రజలలో అవగాహన కల్పించడం. గ్రామంలో ఏ పనులు జరుగుతున్నాయో తెలిస్తేనే ప్రజలు వాటి పైన దృష్టి పెడతారు. తద్వారా పారదర్శకత వస్తుంది. ప్రతి చోట సిటిజెన్ నాలెడ్జ్ బోర్డులను పెడుతున్నాము". - కృష్ణ తేజ, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్
14 నుంచి 20 వరకు 'పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు' - పవన్ ఆదేశాలు