Police Case on Mohan Babu : మంచు కుటుంబంలో వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారం మంగళవారం నాడు హైడ్రామాకు, ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్ శివారు జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసంలోకి సాయంత్రం గేట్లు తోసుకుంటూ మనోజ్ ప్రవేశించారు. అనంతరం చిరిగిన చొక్కాతో ఆయన బయటకు వచ్చారు. బౌన్సర్లు తనపై దాడి చేశారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా మోహన్‌బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు, సహాయకులు గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో దాడిచేశారు.
Manchu Family Issue : ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్‌బాబు మైకు లాక్కుని ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో ఓ ఛానల్ కెమెరామన్ కింద పడ్డాడు. ఈ ఘటన జరిగినప్పుడు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, ఇన్‌స్పెక్టర్ గురువారెడ్డి అక్కడే ఉన్నారు. దాడిని నిరసిస్తూ మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. మోహన్‌బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ పహాడిషరీఫ్ పోలీసులు మోహన్‌బాబుపై బీఎన్‌ఎస్ 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు మంచు మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌లు ముగ్గురూ ఇవాళ ఉదయం 10:30 గంటలకు తనముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరవ్వాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలిచ్చారు. ముగ్గురికి వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు. పహాడీ షరీఫ్‌లో నమోదైన కేసుల్లో పాత్ర ఉన్నందున కోర్టుకు హాజరవ్వాలని, సంవత్సరం పాటు సత్ప్రవర్తనతో ఉంటానంటూ రూ.లక్ష పూచీకత్తుతో బాండు ఎందుకివ్వకూడదో సమాధానం ఇవ్వాలని సీపీ సుధీర్‌బాబు సూచించారు.