PAC Chairman Election: పీఏసీ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాజాగా పీఏసీ ఛైర్మన్ పదవికి నామినేషన్ వేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేయించింది. పీఏసీ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేసేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కార్యాలయానికి వచ్చారు. కేబినెట్ హోదా కలిగిన పీఏసీ ఛైర్మన్ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రతిపక్షపార్టీ సభ్యుడికి పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వటం ఆనవాయితీగా వస్తున్న ప్రక్రియ. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో పీఏసీ ఛైర్మన్ ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పీఏసీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
MLA Peddireddy Filed Nomination: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మద్దతుగా తంబాళపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారాకానాథ్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం తర్వాత 11 మంది వైసీసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ వస్తున్నారు. పీఏసీ కావాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీకి రావడం గమనార్హం.
వైఎస్సార్సీపీకి కష్టమేనా: పీఏసీ సభ్యత్వానికి ఎన్డీఏ తరఫున 9 మంది ఎమ్మెల్యేలు నామినేషన్ దాఖలు చేశారు. 9 నామినేషన్లు మాత్రమే దాఖలైతే పీఏసీ ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవం అయ్యేది. అయితే పీఏసీలో ఉండాల్సిన సభ్యుల కంటే ఒక నామినేషన్ ఎక్కువగా దాఖలు కావడంతో, పీఏసీ ఛైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎన్డీఏ నుంచి 9, వైఎస్సార్సీపీ నుంచి ఒకటి కలిపి మొత్తం 10 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఒక్కో పీఏసీ సభ్యత్వానికి దాదాపు 20 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ ప్రస్తుతం 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు.
"ఎన్నికల్లో పోటీకే భయపడే పరిస్థితి" - ఘోర పరాభవాన్ని మర్చిపోలేకపోతున్న వైఎస్సార్సీపీ
పీఏసీ ఛైర్మన్ ఎన్నికపై మంత్రి పయ్యావుల స్పందన: మరోవైపు పీఏసీ ఛైర్మన్ ఎన్నికపై మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. పీఏసీ ఛైర్మన్ అనేది సభ్యులు ఎన్నికునే ప్రక్రియ అని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. దీనికంటూ నిబంధనలు, సంస్కరణలు ఉంటాయని అసెంబ్లీ లాబీలో మీడియాతో కేశవ్ ముచ్చటించారు. దాదాపు 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ఎవరైనా పీఏసీ కమిటీ సభ్యుడిగా ఎన్నికవుతారన్నారు. కమిటీకి ఎన్నికైన వారి నుంచి స్పీకర్ ఛైర్మన్‌గా నామినేట్ చేస్తారని పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
కాగా 2024-25 ప్రజా పద్దుల కమిటీ (Public Accounts Committee), ఎస్టిమేట్స్ కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఎన్నికకు ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బుధవారం ప్రకటన విడుదల చేసారు. నేటి వరకూ నామినేషన్ పత్రాలు దాఖలకు అవకాశం కల్పిస్తూ ప్రకటన చేశారు.
ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వాగ్వాదం: అంతకుముందు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతల వాగ్వాదం నెలకొంది. సెక్రటరీ జనరల్‌తో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వాగ్వాదం దిగారు. నిబంధనలకు విరుద్ధంగా బొత్స వెంట వచ్చిన సిబ్బంది అసెంబ్లీ లాబీలో వీడియో తీశారు. సెక్రటరీ జనరల్ వీడియో తీయకూడదని సూచిస్తున్నా యథేచ్ఛగా రికార్డింగ్ చేశారు. అసెంబ్లీ జరుగుతుండటంతో సెక్రటరీ జనరల్ స్పీకర్ పేషీ వద్ద ఉన్నారు.
నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చి ఎంత సేపు వేచి ఉండాలంటూ బొత్స అరిచారు. నామినేషన్ దాఖలకు సభ్యులు మాత్రమే రావాలని సెక్రటరీ జనరల్ సూచిస్తున్నా బొత్స వెంట వచ్చిన వ్యక్తులు సెల్ ఫోన్ కెమెరాతో చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. సెక్రటరీ జనరల్ రూమ్ లోనికి బలవంతంగా సెల్‌ఫోన్ కెమెరా పెట్టి రికార్డింగ్‌కు యత్నించారు.