Organ Donation Awareness: అవయవ దానంతో ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. అవయవ దానంపై చాలామంది అపోహలు వీడితే ఎందరికో పునర్జన్మ ప్రసాదించవచ్చని జీవన్‌దాన్ ఇన్ఛార్జ్ డా.రాంబాబు అంటున్నారు. అవగాహనతో అవయవదానానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుతున్నారు.
మనిషి మరణిస్తే తిరిగి రారని బాధపడతాం, మరణిస్తున్న మనిషి 8 మందికి జీవితాన్ని ఇవ్వొచ్చని జీవన్ దాన్ ట్రస్ట్ నిరూపిస్తుంది. అవయవ దానంపై అందరూ అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 900 మందికి అవయవదానం చేశామని ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు. ఆర్గాన్ డొనేషన్‌పై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
వేల మంది రోగులు తమకు అవసరమైన అవయవాలు సరైన సమయంలో లభించకపోవటంతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి రక్తదానం చేసే విధంగానే ప్రతి ఒక్కరూ అవయవదానానికి సైతం ముందుకు రావాలని కోరుతున్నారు. అవయవ దానం చేసిన వారికి ప్రభుత్వం నుంచి ఆర్ధికసాయం అందించేందుకు కృషి చేస్తామని జీవన్ దాన్ ఇన్ఛార్జ్ డా. రాంబాబు తెలిపారు.
నాలుగేళ్ల పోరాటం: కొద్ది సంవత్సరాల క్రితం ఏడవ తరగతి చదువుతున్న ఓ బాలుడు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లాడు. కిడ్నీ చెడిపోయిందని, దానిని ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. ఆ చిన్నారి మనోధైర్యంతో నాలుగేళ్ల పాటు డయాలసిస్ చేయించుకుంటూ కష్టపడి చదువుకున్నాడు. ఏడాదిన్నర క్రితం బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కిడ్నీని జీవన్ దాన్ ద్వారా ఆ బాలునికి అమర్చారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, అవయవదానం గురించి పలువురికి అవగాహన కల్పిస్తున్నానని ఆ బాలుడు అంటున్నాడు.
హీరో విష్వక్ సేన్ సంచలన నిర్ణయం- ప్రశంసలే ప్రశంసలు!
జీవితాల్లో వెలుగులు నింపొచ్చు: మరోవైపు బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చే వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సమున్నతంగా సత్కరిస్తామని ఇప్పటికే వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. బ్రెయిన్‌డెడ్ అయిన వారి అంత్యక్రియల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు పాల్గొనడంతో పాటు వీరవందనం చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వారి త్యాగానికి గుర్తింపుగా జ్ఞాపిక, ఆర్థికసాయం అందిస్తామని పేర్కొన్నారు.
అదే విధంగా అవయవదానం చేసే వారి పార్థివదేహాలను ఆసుపత్రి నుంచి గౌరవంగా పంపించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అవయవదానం చేసేందుకు ఎంత ఎక్కువ మంది ముందుకొస్తే, అంతమంది జీవితాల్లో వెలుగులు నింపొచ్చన్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు సినీ, క్రీడా, రాజకీయ రంగాల నుంచి ప్రముఖులు ముందుకు రావాలని కోరారు. తాను కూడా అవయవదానం చేసేందుకు అంగీకారపత్రంపై సంతకం చేస్తానని ప్రకటించారు.