Option Four Has The Most Votes in CRDA Building Designs Amaravati : రాష్ట్ర రాజధాని అమరావతిలోని ఏపీ సీఆర్డీఏ (CRDA) భవనం ఎలా ఉండాలనే దానిపై నిర్వహించిన అభిప్రాయ సేకరణకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఆన్‌లైన్ విధానంలో సీఆర్డీఏ వెబ్సైట్ ద్వారా ఓటింగ్ నిర్వహించగా వారం రోజుల గడువులో 9,756 మంది పాల్గొన్నారు. ప్రతిపాదిత డిజైన్‌లలో ఆప్షన్ 4కు అత్యధికంగా 3,354 మంది ఓటు వేసి మద్దతు తెలిపారు. 3,279 ఓట్లతో ఆప్షన్ 10 రెండో స్థానంలో నిలిచింది. డిజైన్లను, ఫలితాలను అధికారులు సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
రాజధాని అమరావతిలో తొలిదశలో రూ.11,467 కోట్లతో వివిధ నిర్మాణ పనులు పునఃప్రారంభించేందుకు సీఆర్డీయే అథారిటీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రూ.2,498 కోట్లతో కొన్ని ప్రధాన రహదారుల పనుల్ని, రూ.1,585 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటేషన్ కాలువల అభివృద్ధి, మూడు రిజర్వాయర్ల నిర్మాణం చేపడతారు.
అమరావతికి కొత్త కళ - రూ.11,467 కోట్లతో అభివృద్ధి పనులు
అఖిలభారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగుల నివాస భవనాల్ని రూ.3,525 కోట్లతో పూర్తిచేస్తారు. భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్‌ల అభివృద్ధి పనుల్ని రూ.3,859 కోట్లతో కొనసాగిస్తారు. 2019కి ముందున్న టెండర్లు రద్దుచేసి కొత్త ఎస్‌ఎస్‌ఆర్ ధరల ప్రకారం ఈ పనులకు మళ్లీ టెండర్లు పిలుస్తారు. అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు రూ.984.10 కోట్ల సవరించిన అంచనాలతో కొత్తగా టెండర్లు పిలిచేందుకు అథారిటీ గతంలోనే ఆమోదం తెలిపింది.
సీఆర్డీఏ ఆఫీస్ ఎలా ఉండాలి? - మీరు సెలెక్ట్ చేసిందే ఫైనల్
ప్రభుత్వ అధికారిక చిహ్నం భవనం ముందు ప్రస్ఫుటంగా కనిపించేలా హుందాగా ఉండే ఒక డిజైన్‌ను ఆప్షన్ ఒకటిగా, అలాగే ఆధునికత ఉట్టిపడేలా మరో భవనం డిజైన్‌ను, పచ్చదనంతో భవనం ఉండేలా మరొక డిజైన్‌ను సీఆర్డీఏ రూపోందించి వెబ్‌సైట్‌లో ఉంచింది. వివిధ రకాల డిజైన్లను ప్రజలు వెబ్‌సైట్‌లో చూసి వాటికి ఓటింగ్ వేసేలా ఆప్షన్లను పొందుపర్చారు. ఇప్పటి వరకూ ఏపీసీఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీసు డిజైన్ల పోలింగ్‌లో 700 మందికి పైగా పాల్గొని తమ ఆప్షన్లను తెలియచేశారు.