Heavy Rain in Sangareddy: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిన్న(అక్టోబర్ 01) రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోసారి సంగారెడ్డిలోని పలు ప్రాంతాలు నీట మునిగే పరిస్థితి ఏర్పడింది. పట్టణంలో ఏకధాటిగా రెండు గంటలలో పది సెంటీ మీటర్ల వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నేషనల్ మార్టు సమీపంలో రోడ్డుపై వరద నీరు భారీగా చేరింది. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వరద నీటీలో చిక్కుకుంది. బస్సులో నుంచి ప్రయాణికులు బయటకు రావడానికి తీవ్ర అవస్థలు పడ్డారు.
జిల్లాలోని పలు అపార్టుమెంట్లలో వరద నీరు చేరడంతో మోటార్లు పెట్టి వరద నీటిని బయటకు పంపే ప్రయత్నాలు చేశారు. సెల్లార్లో పార్క్ చేసిన వాహనాలు సైతం వరద నీటీలో మునిగిపోయాయి. ద్విచక్రవాహనాలు వరదనీటీలో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఓ ద్విచక్ర వాహనం వరదలో కొట్టుకుపోగా దాన్ని కాపాడుకునేందుకు ఇద్దరు యువకులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. వరద ప్రవాహం వేగంగా ఉండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.