Share Trading Fraud In Hyderabad : హైదరాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడి నుంచి సైబర్ నేరస్థులు ఏకంగా రూ.13.26 కోట్లను కొల్లగొట్టారు. ఒకే బాధితుడు ఇంత స్థాయిలో మోసపోవడం దేశంలోనే ఇదే మొదటిదని పోలీసులు చెబుతున్నారు. ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడు రూ.8.6 కోట్లు మోసపోయిన ఘటన మరవకముందే మరో భారీ మోసం వెలుగు చూసింది. తాజా ఉదంతంలో హైదరాబాద్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి వాట్సాప్‌కు ఆన్‌లైన్ స్టాక్ బ్రోకింగ్ చిట్కాల పేరిట మెసేజ్ వచ్చింది. గతంలో షేర్లలో లాభాలు గడించిన అనుభవమున్న బాధితుడు స్పందించడంతో మోసగాళ్లు ఏఎఫ్‌ఎస్‌ఎల్, అప్‌స్టాక్స్, కంపెనీల పేరుతో లింక్‌లు పంపించి వాట్సాప్ గ్రూప్‌లో చేర్చుకున్నారు.
షేర్ల ట్రేడింగ్ పేరిట మోసాలు : అన్నీ ప్రముఖ కంపెనీలు కావడంతో బాధితుడికి ఎలాంటి అనుమానం రాలేదు. అయితే, అవి నకిలీ వెబ్‌సైట్ల యూఆర్‌ఎల్స్, యాప్‌ల లింక్‌లని బాధితుడు గ్రహించలేకపోయాడు. ఈ క్రమంలో ఆయా కంపెనీల ప్రతినిధులుగా చెప్పుకొన్న మోసగాళ్లు బాధితుడికి షేర్ల గురించి వివరించారు. పెట్టుబడి పెట్టేందుకు వృద్ధుడు ఆసక్తి చూపడంతో పలు బ్యాంకు ఖాతాలలో నగదు బదిలీ చేయించుకున్నారు. షేర్లలో పెట్టుబడికి మొదట లాభాలు చూపించిన మోసగాళ్లు వాటిని ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు.
దీంతో బాధితుడు సైబర్ నేరస్థులను పూర్తిగా నమ్మి ఏకంగా రూ.13.26 కోట్లను బదిలీ చేశారు. అనంతరం వాళ్లు మొబైల్ స్విచ్చాఫ్ చేయటంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు ఈ నెల 2న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ)కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలో హైదరాబాద్ హిమాయత్‌నగర్‌కు చెందిన మెట్రో రైలు ఉద్యోగి మహ్మద్ అతీర్ పాషా(25) బ్యాంకు ఖాతాకు కొంత సొమ్ము బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు.
ముగ్గురు నిందితులు అరెస్టు : అతడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో మరో ఇద్దరు యువకుల పాత్ర బయటపడింది. దీంతో హిమాయత్‌నగర్‌కు చెందిన అరాఫత్ ఖాలేద్ మొహియుద్దీన్(25), చార్మినార్ ఫతేదర్వాజాకు చెందిన సయ్యద్ ఖాజా హషీముద్దీన్(24) తనతో బ్యాంకు ఖాతా తెరిపించారని అతీర్‌పాషా చెప్పాడు.
మ్యూల్(కమీషన్ కోసం బ్యాంకు ఖాతాను తెరవడం) అకౌంట్‌గా తన ఖాతాను వినియోగించుకున్నారని అతీర్‌పాషా చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రధాన నిందితుడు ఎవరనేది ఇంకా తెలియలేదు. తమకు క్రిప్టోకరెన్సీ వ్యాపారంలో ఆన్‌లైన్ ద్వారా పరిచయమైనట్లు వారు వెల్లడించారు. ప్రధాన నిందితుడి ఎవరో తమకు తెలియదని చెప్పారు. ఈ నేపథ్యంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మాదకద్రవ్యాలు పేరుతో మోసాలు : మరోవైపు మాదకద్రవ్యాలు పేరుతో మనీలాండరింగ్ కేసు నమోదు చేస్తామని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నుంచి రూ.కోటి 58 లక్షలను సైబర్ నేరగాళ్లు దండుకున్నారు. నెలరోజుల సైబర్‌నేరగాళ్లు బాధితునికి ఫోన్ చేసి మలేసియాకి డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు బెదిరించాడు. అంతేకాక మా దిల్లీ పోలీసులు మీతో మాట్లాడతారని ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత వాట్సాప్ కాల్ ద్వారా మనీలాండరింగ్ కేసు పెడతామని బెదిరించారు. పేరు ఎవ్వరికీ తెలియకుండా దాచేందుకు పెద్దఎత్తున నగదు కావాలని సైబర్ నేరస్తులు డిమాండ్ చేశారు. ఆందోళనకి గురైన బాధితుడు రూ. కోటి 58 లక్షలు చెల్లించాడు. అనంతరం స్పందించికపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకి ఫిర్యాదు చేశాడు.
పేట్రేగిపోతున్న సైబర్ నేరాలు - మాయలోకి దించి - నిండా ముంచేసి - Debate On Cyber Crimes