Officials Seized Gifts Given by YCP Leaders to People: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఓటర్ల ప్రలోభాల కోసం ఉంచిన వివిధ రకాల వస్తువులను పోలీసులు పట్టుకున్నారు. గంగూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. ఇందులో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు గృహోపకరణాలు దాచారని సీ విజిల్ యాప్‌లో ఫిర్యాదు రావడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడికి వెళ్లింది. తాళం పగలగొట్టి లోపలికి వెళ్లిన అధికారులు వైసీపీకి సంబంధించిన పింగాణీ సెట్స్, ఫ్లాస్కులు, ఇతర వస్తువులను గుర్తించారు. జోగి రమేష్ ఫోటోలతో ముద్రించిన టోపీలు, టీ-షర్టులు, బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు.
NTR District: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో వైసీపీ నాయకులు నిల్వ ఉంచిన అక్రమ మద్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు పట్టుకున్నారు. 9 వేల 504 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని సెబ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణకు చెందిన మద్యం సీసాలను అక్రమంగా రాష్ట్రానికి తీసుకొచ్చి ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Palnadu District: పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో హోం ఓటింగ్‌కు సంబంధించిన వ్యవహారంలో తెలుగుదేశం, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు రాళ్లతో పరస్పర దాడులు చేసుకోవడంతో ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు, ఒక వైసీపీ నాయకుడికి గాయాలయ్యాయి. సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నాయకులను కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని కన్నా ధ్వజమెత్తారు.
Tirupati District: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి శివారులోని చెంచులక్ష్మీ కాలనీలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు వైసీపీ నేతలు సిద్ధం చేసిన చీరలను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి వైసీపీ నేతలు ఆటోల్లో చీరలు ఇంటింటికీ తీసుకెళ్లి పంపిణీ చేస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. ఆటోల్లోని చీరలతో పాటు గోదాములో నిల్వ ఉంచిన చీరలనూ స్వాధీనం చేసుకున్నారు.
Annamaya District: అన్నమయ్య జిల్లా మదనపల్లి నీరుగట్టువారి పల్లిలో వైసీపీ నేతలు పంపకానికి సిద్ధంగా ఉంచిన 8 లక్షల 68వేల 500 రూపాయలను ఫ్లైయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. పక్కా సమాచారంతో వైసీపీ కౌన్సిలర్ దుకాణంలో దాడులు చేసిన అధికారులు నగదు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు సంచిలో 8 ఓటర్ ఐడీ కార్డులు, ఆరు స్లిప్పులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సీజ్ చేసిన డబ్బును విడిపించుకోడానికి వైసీపీ నేతలు ఫ్లయింగ్ స్క్వాడ్‌పై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం ఎన్నికల నిబంధనల మేరకు నగదు సీజ్ చేశామని చెప్పి చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు.
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ అనుమతి కోరిన సీఎం జగన్ - YS Jagan
Anantapur District: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లిలో సుమారు 20 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. ఇద్దరు వైసీపీ కార్యకర్తలు భైరవానితిప్పలో నగదు పంపిణీ చేసి తిరిగి వస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. బైక్‌తో పాటు ఇద్దరు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. పుట్టపర్తిలో రాజీనామా చేసిన ఇద్దరు వాలంటీర్లు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘించారు. చిత్రావతి రోడ్డులో ఇంటింటికీ తిరుగుతూ... మా నమ్మకం నువ్వే జగన్, సిద్ధం వంటి స్టిక్కర్లు అంటించారు. కోడ్ ఉన్నప్పుడు స్టిక్కర్లు అంటించకూడదు కదా అని స్థానికులు ప్రశ్నించగా "మా పార్టీ వాళ్లకు ప్రభుత్వ అనుమతి ఉందంటూ" సమాధానమిచ్చారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.