Fake Medicine Found In Medchal Dist : ఇప్పటివరకు కేవలం ఆహార పదార్ధాలు, ఐస్‌క్రీమ్‌లు కల్తీ చేసిన అక్రమార్కులు ఇప్పుడు ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టే మందులు బిల్లలకు సైతం నకిలీలు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రముఖుల కంపెనీ పేరిట తయారు చేసిన మందులు విక్రయించేందుకు యత్నిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది.
నిందితుల నుంచి అరకోటి విలువైన నకిలీ మందులు, యంత్రాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీలపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో ఇప్పటికే పెద్దమొత్తంలో మత్తుపదార్ధాలు పట్టుబడగా ఇప్పుడు ఏకంగా రూ.50 లక్షల విలువైన నకిలీ మందులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ జరిగింది : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నిజాంపేట్ మధురానగర్‌లో ఉంటున్న గోపాల్ అనే వ్యక్తికి మందుల తయారీ గురించి అవగాహన ఉంది. గోపాల్‌కి దిల్లీకి చెందిన నిహాల్ అనే వ్యక్తితో పరిచయమైంది. వారిద్దరు ఒకే రంగంలో పనిచేస్తుడటంతో నకిలీ మందులు తయారు చేయాలని నిర్ణయించారు. ఐతే పెద్ద కంపెనీలకు చెందిన మందులు తయారు చేస్తే పెద్దమొత్తంలో లాభాలు వస్తాయని భావించి మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని ఓ గోదాంలో నకిలీ మందులు తయారు చేయడం ప్రారంభించారు.
"ఇద్దరు నిందితులకీ మందుల తయారు చేయడంలో అవగాహన ఉంది. వీరిద్దరూ కలిసి నకిలీ మందులు తయారు చేస్తున్నారు. మల్టీనేషనల్ కంపెనీల పేర్లు వాడుకుని అనధికారకంగా తక్కువ ఖరీదుకు తయారు చేసి అమ్ముతున్నారు. గత ఆరు నెలలుగా వీరు ఈ నకిలీ మందులను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు"- కోటి రెడ్డి, మేడ్చల్ డీసీపీ
Police Raids On Counterfeit Drugs : హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లోని ఉండే అసలు మందుల కంపెనీకి ఏమాత్రం తీసిపోని రీతిలో యంత్రాలు తెప్పించి నకిలీ మందులు తయారు చేస్తున్నారు. అందుకు గోపాల్‌కి రామకృష్ణ అనే వ్యక్తి సహాయం చేశాడు. దూలపల్లిలో తయారు చేసిన మందులను నిహాల్ దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నాడు. నకిలీ మందులు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు పెద్దమొత్తంలో తయారీకి ఉపయోగించే యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
అసలు ఔషధాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో : అసలు ఔషధాలకు ఏమాత్రం తీసిపోని విధంగా నకిలీ మందులు తయారు చేసినట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. రోజూ వాడేవారు మాత్రమే తేడాలను గుర్తించగలరని తెలిపారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నకిలీ ఔషధాలు బహిరంగ మార్కెట్‌లో రాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
యాంటీ క్యాన్సర్ డ్రగ్స్‌పై డీసీఏ ఉక్కుపాదం - భారీ మొత్తంలో నకిలీ మందులు స్వాధీనం