Officials No Action on YSRCP Leaders : గుంటూరులో తప్పుడు ఫాం-7 దరఖాస్తులు పెట్టినవారిపై చర్యల విషయంలో అధికారులు, పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపుల ఓట్లు తొలగించాలని వైఎస్సార్సీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా ఫాం-7 దరఖాస్తులు పెట్టినట్లు తేలినా చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నామమాత్రపు కేసులు పెట్టి దులిపేసుకున్నారు. నకిలీ ఓటర్ కార్డులు సృష్టించే అవకాశమిచ్చారని ఏకంగా ఐఏఎస్ అధికారినే కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన నేపథ్యంలో గుంటూరు ఉన్నతాధికారుల మౌనం విమర్శలకు తావిస్తోంది.
తెలుగుదేశం నేతల ఫిర్యాదు : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు అత్యధికంగా ఫాం-7 (Form-7) దరఖాస్తులు పెట్టారు. ఓ సామాజిక వర్గం ఇంటి పేరున్న టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని ఏకంగా 9,895 ఫాం-7 దరఖాస్తులు పెట్టారు. అందులో 7,663 ఆమోదించిన అధికారులు 2052 దరఖాస్తులు తిరస్కరించారు. ఐతే ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా పెట్టినవేనని ఎన్నికల అధికారుల విచారణలో తేలింది. అర్హుల ఓట్లు తొలగించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు శేషిరెడ్డి, కొండా శేషిరెడ్డి, రాము, శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, వెంకాయమ్మ పన్నాగం పన్నారని స్వయంగా కార్పొరేషన్ అధికారులే ఫిర్యాదు చేశారు.
అన్నమయ్య జిల్లా కలెక్టర్‌పై సస్పెన్షన్ వేటు
False Form 7 Applications in Guntur : ఐతే పట్టాభిపురం స్టేషన్ పోలీసులు నామమాత్రపు నామ మాత్రపు సెక్షన్లతో సరిపెట్టారు. వైఎస్సార్సీపీ నేతల్ని పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆక్షేపించారు. ఐటీ చట్టం 120-ఏ, 120బి, 416, 419, 420, 66-డి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాల్సిందేనని తెలుగుదేశం నేతలు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్షన్లు మారుస్తామని నెల క్రితం చెప్పిన పోలీసులు ఇంతవరకూ ఆ పనే చేయలేదు.
వేషాలు వేస్తే వేటే- రెండేళ్లనంతరం తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర
ప్రశ్నిస్తే కేసులే : నంద్యాల జిల్లా బనగానపల్లె, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గాల్లోనూ ఇదే తరహాలో మోసపూరిత ఫారం-7 దరఖాస్తులు పెట్టిన అక్రమార్కులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి అందుకు సహకరించిన 24 మంది బీఎల్వోలపై చర్యలు తీసుకున్నామని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ గుంటూరులో నామమాత్రపు కేసులతో సరి పెట్టి, నిందితులకు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. రివర్స్‌లో తప్పుడు ఫాం-7 దరఖాస్తులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగిన టీడీపీ నాయకులపైనే పోలీసులు కేసులు పెట్టారు.
వైఎస్సార్సీపీ నేతలను రక్షించేందుకు ప్రయత్నాలు : ఓటర్ల జాబితా విషయంలో అక్రమాలు జరిగి అందులో ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు తేలితే వారిపైనా కఠిన చర్యలు ఉంటాయి. తాజాగా ఓ ఐఏఎస్ అధికారిపైనే కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్నారు. అధికార పార్టీ నేతల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తే ఆ తప్పులకు అధికారులు మూల్యం చెల్లించుకోకతప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది.
పర్చూరు ఓట్ల తొలగింపుపై స్పందించిన హైకోర్టు - ఫిబ్రవరి 2కు విచారణ వాయిదా