Neglect on Polavaram Residents : ఆంధ్రరాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన వారిలో వారూ ఒకరు. తరతరాలుగా తాతల దగ్గర నుంచి పుట్టిన గడ్డపైనే ఉంటున్న వారు ఉన్న ఊర్లో ఉపాధి కరవై, కుటుంబ పోషణ భారమై తమను నమ్ముకున్న వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని నెలల పాటు ఇతర ప్రాంతాలకు బతుకుదెరువు కోసం వెళ్లారు. ఆంధ్రా - తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో దొరికిన పని చేస్తూ తినీ తినకా కుటుంబాలను పోషించుకోవాలనే ఉద్దేశంతో కొన్ని రోజుల పాటు అక్కడే ఉండిపోయారు. అదే వారి పాలిట శాపంగా మారుతుందని అప్పుడు వారు గ్రహించలేకపోయారు. ప్రభుత్వ గుర్తింపు కార్డులన్నీ, ఆధార్ సహా రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, పింఛను కార్డులు, నివాస ధృవీకరణ ఇలా అన్ని రకాల గుర్తింపు కార్డులన్నీ వారి సొంత నివాస ప్రాంతాల పేరుతోనే ఉన్నా అయినా ఇవేవీ అధికారులకు కనిపించలేదు. సర్వే సమయంలో వారు ఇళ్ల వద్ద లేకపోవడమే ఇప్పుడు వారికి నిలువ నీడ లేకుండా చేసింది.
Polavaram Residents Situation : ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కట్కూరు, చిగురుమామిడి, కొయిదా గ్రామాలకు చెందిన సుమారు 500పైగా కుటుంబాలు వివిధ వృత్తులు, వ్యాపారాలు చేసుకుంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. పోలవరం పరిహారం, పునరావాస కాలనీల్లో ఇళ్ల కేటాయింపు నకు సంబంధించి కొన్నేళ్ల క్రితం వివిధ శాఖల అధికారులు సర్వే చేపట్టారు. ఆ సమయంలో ముంపు మండలాల్లోని పలు కుటుంబాలకు చెందిన వారు ఇతర ప్రాంతాలకు వెళ్లడం, సమయానికి ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో అధికారులు సంబంధిత కుటుంబాల వారు ఇక్కడ ఉండటం లేదు అని సర్వేలో చేర్చడంతో ఇప్పుడు వారికి పునరావాస ప్యాకేజీతో పాటు నిర్వాసిత కాలనీల్లో ఇళ్లు కూడా అందని ద్రాక్షగా మారాయి. తాము దశాబ్దాలుగా అదే గ్రామాల్లో ఉంటున్నట్లు అన్ని రకాల ఆధారాలు చూపినా కేవలం అధికారులు వచ్చిన సమయంలో లేకపోవడాన్ని సాకుగా చూపి పలు కుటుంబాలను సర్వేలో చేర్చకపోవడంపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల తప్పిదం కారణంగా ఇతరుల మాదిరిగా కాలనీల్లో ఉండాల్సిన వారంతా ఇప్పుడు అదే కాలనీల్లో రూ.1500 నుంచి 2వేల రూపాయలు చెల్లించి అద్దె ఇళ్లలో ఉండాల్సి వస్తోంది. రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుని తమకు అన్యాయం చేశారని అధికారుల తప్పిదం కారణంగానే ఇవాళ అందరిలా కాలనీల్లో ఉండాల్సిన తాము అద్దె ఇళ్లలో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కూడా కరవైన ఈ ప్రాంతంలో తినేందుకే కష్టమవుతోందని వేలకు వేలు అద్దెలు చెల్లించే స్తోమతు తమ వద్ద లేదని నిర్వాసితులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. జిల్లా స్థాయి అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని అటు పరిహారం, ఇటు ఇళ్లూ రెండూ రాక చిన్న పిల్లలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు ప్యాకేజీ సహా నిర్వాసిత కాలనీల్లో ఇళ్లు కేటాయించాలని వేడుకుంటున్నారు.