Officials Cut Down Trees and Stopped Electricity Due to Jagan Bus Trip: సీఎం జగన్ రోడ్ షో విజయవంతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న పోలీసులకు ప్రజల సమస్యలు పట్టడం లేదు. జగన్ పర్యటన సందర్భంగా ప్రకృతిని విధ్వంసం చేసి, ప్రజలను కష్టాలకు గురిచేశారు. జగన్ పర్యటన అనగానే చెట్లు నరికేయడం, కాన్వాయ్ వెళ్లే మార్గంలో విద్యుత్ తీగలు తొలగించడం వంటివి చేసి స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు. విద్యుత్ తొలగించాలని, చెట్లు కొట్టేయాలని ఎవరు ఆదేశాలిస్తున్నారో కాని జగన్ కాలుమోపిన చోటంతా పచ్చదనానికి పాతరేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జగన్ పర్యటన సందర్భంగా చెట్లను నిరికేసి, వ్యాపారులను ఇబ్బందులకు గురిచేశారు.
ఎన్నో ఏళ్లుగా తాడిపత్రి మున్సిపాలిటీలో అక్కడి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో చెట్లను పెంచితే, జగన్ పర్యటనకు వస్తున్నారని నీడనిచ్చే పచ్చదనంపై గొడ్డలివేటు వేశారు. హెలీప్యాడ్ నుంచి జగన్ కాన్వాయ్ వెళ్లే మార్గంలో రెడ్డివారిపాలెంలో విద్యుత్ వైర్లను తొలగించారు. దీంతో పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. తాడిపత్రి గాంధీ కూడలిలో జగన్ రోడ్ షో నిర్వహించగా, ఆయన వస్తున్న మార్గంతో పాటు, రోడ్ షో చుట్టపక్కల కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జగన్ రోడ్ షో కు మూడు గంటల ముందు నుంచే ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి వాహనదారులను పోలీసులు మండుటెండలో ముప్పుతిప్పలు పెట్టారు.
ఆదివారం కావడంతో చేపలు, మాంసం విక్రయించుకునే చిరువ్యాపారులు తాడిపత్రి ప్రధాన రోడ్డు పొడవునా నేలపై కూర్చొని విక్రయించుకుంటారు. పోలీసుల అత్యత్సాహంతో చిరువ్యాపారుల ఉపాధిపై గండికొట్టి ఇబ్బందుల పాలు చేశారు. జగన్ కాన్వాయ్ మార్గంలోనూ, రోడ్ షోకు వంద మీటర్ల దూరంలోని దుకాణాలన్నిటినీ ఉదయం ఎనిమిది గంటలకే మూయించారు. రోడ్డుసైడు తోపుడు బండ్లపై పండ్లు విక్రయించుకునే చిరువ్యాపారుల ఉపాధిని గండికొట్టిన పోలీసులు వైసీపీ నాయకులకు విధేయత చూపుకున్నారు. రోడ్ షోలో జగన్ మాట్లాడుతుంగానే చాలా మంది ప్రజలు వెళ్లిపోయారు. జనాన్ని పిలుచుకొని వచ్చిన వారు నిలువరించే ప్రయత్నం చేసినా లెక్కచేయకుండా వెళ్లిపోయారు.
మండుటెండలో ప్రయాణికులు: తిరుపతి జిల్లా వెంకటగిరిలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా పట్టణంలో పలు రోడ్లు బ్లాక్ చేశారు. దీంతో రాకపోకలు సాగించలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. జగన్ హెలిప్యాడ్ దిగి సభాస్థలికి వెళ్లే మార్గమంతా పోలీసులు బ్యారికేడ్లు అడ్డుగాపెట్టారు. దీంతో కాశీపేట నుంచి రైల్వేస్టేషన్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ రద్దీ వల్ల వెనుదిరుగుతున్న పలువురు వాహనదారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పలుచోట్ల వాహనదారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఆసుపత్రికి వెళ్లడానికి రోగులు అవస్థలు: నెల్లూరు జిల్లా కందుకూరులో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలు ప్రచార సభ ప్రజలకు ఇబ్బందులు కలిగించింది. జనాలకు ఇబ్బంది కలిగిస్తూ రోడ్లకు అడ్డంగా భారీకేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఏరియా ఆసుపత్రికి వెళ్లడానికి మార్గం లేక రోగులు అవస్థలు పడ్డారు. ఆసుపత్రిలోకి వెళ్లడానికి దారిలేక పోవడంతో బంధువులకు భోజనం తినుబండారాలు అందించ లేక ఎండలోనే ఉండిపోయారు. మార్కెట్ యార్డ్ హెలిప్యాడ్ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈసీ నిబంధనలు అతిక్రమించినా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు.
బహిరంగసభలో జగన్ ఏమన్నారంటే: ఈ ఎన్నికలు పేదల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని సీఎం జగన్ తెలిపారు. ఐదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్పుకొచ్చారు. తమకే ఓటు వేస్తే, ప్రస్తుత పథకాలన్నింటిని కొనసాగిస్తామని జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.