Officers Actions on Election Code in AP: ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే రాష్ట్ర అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. చాలా జిల్లాల్లో రాజకీయ పార్టీల ఫ్లెక్సీల తొలగింపు, నేతల విగ్రహాలకు ముసుగులు వేసే పనులు చేపట్టారు. కొన్నిచోట్ల ప్రతిపక్ష పార్టీల ఫ్లెక్సీలు తొలగించిన అధికారులు వైసీపీవి తొలగించడానికి మాత్రం సమయం తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వీలులేదని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున స్పష్టం చేశారు.
సక్రమంగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు(AP Elections 2024) జరిగేలా అందరూ కృషిచేయాలని కాకినాడ కలెక్టర్ కృతికాశుక్లా కోరారు. కర్నూలు జిల్లాలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సృజన తెలిపారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలను నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అధికారులుకు వివరించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని రాజకీయాలకు దూరంగా ఉద్యోగులు, సిబ్బంది వ్యవహరించాలని వైఎస్‌ఆర్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు తెలిపారు.
టీడీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులరెడ్డి - చంద్రబాబుతో వర్మ భేటీ
ఎన్నికల కోడ్(Election Code in Andhra Pradesh) అమల్లోకి రాగానే అధికార యంత్రాంగం నిబంధనలు అమలు చేసే పనిలో పడ్డారు. ఫ్లెక్సీల తొలగింపు, విగ్రహాలకు ముసుగులు వేసే పనులు చేపట్టారు. కానూరు వి.ఆర్ సిద్దార్ధ ఇంజనీరింగ్ కళాశాల పైవంతెన, రోడ్డుకు ఇరువైపుల కట్టిన రాజకీయపార్టీల బ్యానర్లను అధికారులు తొలగించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రధాన సెంటర్లో కట్టిన వైసీపీ, తెలుగుదేశం, ఇతర పార్టీల ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు.
కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న జనసేన ఫ్లెక్సీలు తొలగించిన అధికారులు వైసీపీ ఫ్లెక్సీలు తొలగించడానికి మాత్రం సమయం తీసుకుంటున్నారు. మంగళగిరి నగరపాలక సంస్థ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంగళగిరి బస్టాండ్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ను ఎన్నికల కోడ్ పేరుతో బలవంతంగా తొలగించారు. భోజన పదార్థాలు పెట్టే బల్లలను పక్కకు నెట్టేశారు. వాలంటీర్లు రాజకీయ పార్టీ సమావేశాలు, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకూడదని ఈసీ, ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా పొన్నూరు వైసీపీ అభ్యర్థి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
'ప్రశ్నించే నాయకుడు ఏపీలో లేరు - ఉక్కు ప్రైవేటీకరణను తెలుగువాళ్లం అందరం కలిసి అడ్డుకుందాం'