Rushikonda Resort Irregularities : వైఎస్సార్సీపీ సర్కారు హయాంలో పర్యాటక రంగంలో జరిగిన విధ్వంసం, అక్రమాలకు పాల్పడిన అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన విలువైన వస్తువులు అడ్డదారిలో మళ్లించినవారిని కాపాడుతున్నట్లే కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో పర్యాటకరంగంలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం ముగ్గురు సీనియర్ అధికారులతో విచారణ చేయించింది. వీరు విశాఖలో పర్యటించి రెండు నెలల క్రితం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ఫిర్యాదుల్లో పేర్కొన్న చాలా అంశాలు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉన్నాయని నిర్ధారించారు.
అక్రమాలు ఇలా : రుషికొండపై హరిత రిసార్ట్‌ను కూలదోసిన సమయంలో విలువైన ఏసీలు, ఫర్నిచర్ పర్యాటకాభివృద్ధి సంస్థలో అప్పట్లో అన్నీ తానై వ్యవహరించిన ఓ అధికారి ఆదేశాలపై సిబ్బంది తరలించారు. వీటి విలువ రూ.3-5 కోట్లు ఉంటుందని అంచనా. ఇతర ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, అలంకరణ వస్తువులు ఏమయ్యాయో రికార్డుల్లేవు. స్క్రాప్ కింద విక్రయించారా? అధికారులు తమ ఇళ్లలో పెట్టుకున్నారా? అనేది తెలియాలి.
- విశాఖపట్నంలోని అప్పుఘర్‌లో యాత్రి నివాస్ హోటల్ ఆధునికీకరణ పనుల అంచనా వ్యయం రూ.8.60 కోట్ల నుంచి రూ.13.50 కోట్లకు చేరుకుంది. పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారి, మరో ఇంజినీర్ కలిసి ఇష్టారాజ్యంగా అంచనా విలువలను పెంచేశారు. ఆధునికీకరణకు కొన్న వస్తువుల ధరలను భారీగా చూపించి బిల్లులు పెట్టారు. ఈ బాగోతంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఇంజినీర్‌పై చర్యలు తీసుకోపోగా ఆయనకు మళ్లీ కీలకమైన అదనపు బాధ్యతలు ఇచ్చారు.
- రుషికొండ బ్లూఫ్లాగ్ బీచ్ నిర్వహణలోనూ అవకతవకలు జరిగినట్లు అధికారుల కమిటీ గుర్తించింది. గజఈతగాళ్ల నియామకం, పారిశుద్ధ్య నిర్వహణ, వాహనాల పార్కింగ్‌లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు కమిటీ పరిశీలనలో నిర్ధారణయింది. బీచ్ నిర్వహణ ఒక ప్రైవేట్ సంస్థకు నెలకు రూ.10 లక్షల చొప్పున చెల్లించాలన్నది ఒప్పందం. ఇంత ఇచ్చినా, ఒప్పందం ప్రకారం బీచ్‌లో సరైన సౌకర్యాలు కల్పించడం లేదు. పర్యాటకాభివృద్ధి సంస్థ విశాఖ ప్రాంతీయ మేనేజర్ ఒకరు గుత్తేదారు సంస్థకు సహకరించడంతో బీచ్‌లో లోపాలు అధికారుల కమిటీ విచారించే వరకూ వెలుగులోకి రాలేదు.
- సాగర్‌నగర్ సమీపంలో ఒక రిసార్ట్‌లో నిబంధనలకు విరుద్ధంగా కాలేజీ నిర్వహిస్తున్నారు. కొన్నాళ్లు రిసార్ట్ నిర్వహించి దాన్ని కళాశాలగా మార్చేశారు. ఇన్ని అక్రమాలు జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకోవలసిన అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు.
అసలైనవి వదిలేశారు : విశాఖలోని పర్యాటకాభివృద్ధి సంస్థ భూముల్లో చేపట్టిన భారీ ప్రాజెక్టులు వైఎస్సార్సీపీ సర్కార్‌లో చేతులు మారాయి. భూములు లీజుకు తీసుకుని వాటిలో వివిధ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నవారిని ఆ పార్టీ పెద్దలు బెదిరించి స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారంలో వాటాలు గుంజుకున్నారు. వీటిలో భారీ హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, రిసార్ట్‌లు ఉన్నాయి. అధికారుల కమిటీ వీటి జోలికి వెళ్లలేదు. పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని ప్రాజెక్టుల పరిశీలనకే పరిమితమైంది. దీంతో వైఎస్సార్సీపీ నాయకుల చేతుల్లోనే ఇప్పటికీ విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. వీటికి లీజులు, అద్దెలు కూడా సరిగా చెల్లించడం లేదు. అయినా అధికారులు జోక్యం చేసుకోవడం లేదు.