Chandrababu Review on Free Bus Scheme : ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధికారుల కమిటీ నివేదిక సిద్ధమైంది. వీటిల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తే బస్సుల్లో రద్దీ పెరుగుతుందని, దాని అనుగుణంగా అదనంగా బస్సులు కొనాల్సి ఉంటుందని, ఖాళీలున్న డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అన్నీ సమకూరాక ఈ పథకం అమలు చేస్తే బాగుంటుందని లేకపోతే చాలీచాలని బస్సులతో ఇబ్బందులు ఎదురవ్వొచ్చని తెలిపారు. గత ఎన్నికల్లో కూటమి ప్రధాన హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్టీసీ అధికారులు తెలంగాణ, కర్ణాటకలో ఉచిత ప్రయాణంపై అధ్యయనం చేసిన వివరాలను తెలియజేయనున్నారు.
అదనంగా 2 వేల కొత్త బస్సులు అవసరం : ప్రస్తుతం ఆర్టీసీలో 10,000ల బస్సులు ఉన్నాయి. వాటిలో సొంత బస్సులు 8,220 కాగా మిగిలినవి అద్దె బస్సులు. కొంతకాలం కిందట 1480 కొత్త బస్సులు కొనగా వీటిలో ప్రతి నెలా కొన్ని చొప్పున బస్సులు బాడీబిల్డింగ్ పూర్తిచేసుకొని డిపోలకు చేరుతున్నాయి. అయితే జగన్ ప్రభుత్వంలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి కొనలేదు. ఇప్పుడు తీసుకుంటున్న నూతన బస్సులన్నీ వాటి స్థానంలో సర్దుబాటు చేస్తున్నవే.
AP Free Bus Scheme Updates : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుచేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, అదనంగా 2,000ల కొత్త బస్సులు అవసరమని అధికారులు అంచనా వేశారు. చాలాకాలంగా ఉద్యోగ నియామకాలు లేక, పదవీ విరమణల కారణంగా ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వేధిస్తోంది. కొత్తగా 3,500 మంది వరకు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని నివేదికలో పేర్కొన్నారు.
రూ.250-260 కోట్ల వరకు నష్టం : మహిళలకు ఉచిత ప్రయాణం అమలుతో ఆర్టీసీకి నెలకు రూ.250 నుంచి రూ.260 కోట్ల వరకు రాబడి కోల్పోనుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతినెలా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రతినెలా వచ్చే రాబడిలో 25 శాతం అంటే దాదాపు రూ.125 కోట్లను సర్కార్ తీసుకుంటోంది. ఇకపై ఆ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోకూడదని, అలాగే మిగిలిన రూ.125 నుంచి రూ.135 కోట్లను అదనంగా ప్రభుత్వమే, ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ పాలనలో గాడితప్పిన రవాణాశాఖపై కూడా సీఎం చంద్రబాబు నేడు సమీక్షించనున్నారు. అలాగే రాష్ట్రాల సరిహద్దుల్లో తొలగించిన 16 చెక్‌పోస్టులను తిరిగి కొనసాగించాలని వస్తున్న డిమాండ్లపైనా చర్చించనున్నారు.
"రైట్, రైట్" మహిళలకు ఉచిత బస్సుపై చంద్రబాబు కసరత్తు-అమలు ఎప్పట్నుంచంటే? - free bus for women
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రిపోర్టు రెడీ- ఆర్టీసీపై ప్రతీ నెల ₹250 కోట్ల భారం - free bus scheme