Nyasta Gramojvala Solutions Founder : వ్యవసాయ విధానాల గురించి ఎలాంటి పరిజ్ఞానం లేకపోయినా సాగులో రైతులు ఎదుర్కొనే సమస్యలకు సాంకేతికత ద్వారా పరిష్కారం చూపాలనుకుంది భార్గవి అనే ఈ యువతి. 'బాధ్యతాయుతమైన రైతుగా ఉండండి - బాధ్యతాయుతమైన వ్యవసాయం చేయండి, మీకు అవసరమయ్యే సాంకేతిక సాయం మేం అందిస్తాం' అనే నినాదంతో న్యాస్టా గ్రామోజ్వల సొల్యూషన్స్ అనే అంకురాన్ని మొదలు పెట్టింది ఈమె. తోటి మిత్రులతో కలసి వ్యవసాయంలో సరికొత్త ఆవిష్కరణలతో రైతాంగానికి చేయూత అందిస్తోంది. 2 సంవత్సరాల్లోనే న్యాస్టా గ్రామోజ్వల సొల్యూషన్స్ సంస్థ సేవలను 4 రాష్ట్రాలకు విస్తరించింది భార్గవి.
Nyasta Gramojvala Solutions Founder Bhargavi : ఉమ్మడి కడప జిల్లా రాజంపేటకు చెందిన భార్గవి తండ్రి చిట్టిబాబు ఫర్నీచర్ వ్యాపారం చేసేవారు. అయిదేళ్ల కిందట ఆయన కన్నుమూశారు. తల్లి మాధవీలత గృహిణి. స్థానికంగానే బీటెక్ వరకూ చదివిన భార్గవి, తిరుపతిలో ఎంటెక్ పూర్తయ్యాక హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీరు ఉద్యోగం చేసేది. అక్కడ పని చేసే సమయంలోనే ఐఓటీ (IOT)ద్వారా సన్నకారు రైతులకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలనుకుంది. ముగ్గురు సహోద్యోగులతో కలసి రూ. 10 లక్షల పెట్టుబడితో రెండేళ్ల క్రితం "న్యాస్టా గ్రామోజ్వల సొల్యూషన్స్" స్టార్టప్‌ను ప్రారంభించింది భార్గవి.
పంట పొలాలకు ఇళ్లు దూరంగా ఉండే రైతులు విద్యుత్ మోటార్ల ద్వారా పంటకు సరైన సమయానికి నీరు పెట్టేందుకు తరచూ ఇబ్బంది పడుతుంటారు. అయితే దీనికి పరిష్కారం కనుగొన్న భార్గవి, రైతులు ఎక్కడి నుంచైనా పంటకు నీరు అందించే పరిజ్ఞానాన్ని కనుగొంది. దీని ద్వారా అనేక మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. భార్గవి తాము రూపొందిచిన యాప్ ద్వారా రైతులు ఎక్కడ నుంచైనా మొబైల్‌ను వాడి పొలంలోని పంపుసెట్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చని అంటోంది. మొదట ఈ పరిజ్ఞానాన్ని ఆరు నెలలపాటు ప్రయోగాత్మకంగా పరీశీలించి చూసింది. తమ పరిశోధన విజయవంతం కావడంతో మరిన్ని అప్లికేషన్లను జత చేస్తానటోంది.
Nyatsa Company Services to Farmers For Agriculture : అలాగే ఈ డివైజ్ ద్వారా పొలాల్లోని లైట్‌ను ఆన్, ఆఫ్ చేయవచ్చని, జంతువులు, పక్షుల నుంచి పంట రక్షణ కోసం ప్రత్యేక శబ్దాలు వెలువరించే స్పీకర్‌ను డివైజ్‌కు జత చేశామంటోంది. న్యాస్టా అందించే సేవలు ఇప్పటికే మార్కెట్లో చాలా సంస్థలూ అందిస్తున్నాయని అంటోంది భార్గవి. అయితే ఇతర కంపెనీల పరికరాలకు 9 వేల రూపాయలపైనే చెల్లించాలని, అదే న్యాస్టాకు చెందిన కంప్లీట్ సొల్యూషన్ డివైజ్‌ను రూ. 6 వేలు, ఐవోటీ సిమ్‌ను 9 వందల రూపాయలకే ఇస్తున్నట్లు చెబుతోంది. ఇదే కాకుండా ఒకే డివైజ్ పే యాడ్ ఆన్ఫీచర్ వాడి అయిదారు సిమ్లు వాడుకునే మరో సౌలభ్యమూ న్యాస్టా కల్పిస్తోందని చెబుతోంది.
న్యాస్టా మార్కెట్ పెరిగేందుకు జీకాట్ సంస్థ ఎంతగానో సహకరించిందని చెబుతోంది భార్గవి. ప్రస్తుతం 5 వందల మంది రైతులు తమ సేవలు వినియోగించుకుంటున్నారని అంటోంది. న్యాస్టా గ్రామోజ్వల సొల్యూషన్స్‌కు భార్గవి సీఈవోగా నరోత్తంరెడ్డి, ప్రశాంత్రెడ్డి, మిథిలేష్డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ నేపథ్యం ఉన్న ప్రశాంత్ రెడ్డి స్ఫూర్తితోనే ఈ స్టార్టప్‌కు అంకురార్పణ చేసింది ఈ బృందం. ఈ టెక్నాలజీతో పంట పొలాలకు నీటి నిర్వహణ సులువయ్యిందని అంటున్నారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర రైతులకూ సేవలందిస్తోంది న్యాస్టా. ఈ సేవలను దేశమంతా విస్తరించే ప్రయత్నంలో ఉంది. తమ తదుపరి లక్ష్యం ఆటోమేటిక్ ఇరిగేషన్ టెక్నాలజీ అభివృద్ధి చేయడమేనని చెబుతోంది దీని వ్యవస్థాపకురాలు భార్గవి.
'న్యాస్టా ఐవోటి ప్రొడక్ట్స్‌ను డెవలప్ చేస్తోంది. ఇంటర్నెట్ను ఉపయోగించి ఏమైనా ప్రొడక్ట్స్‌ను డెవలప్ చేస్తుంది. అలా మేము ఒక ప్లాట్‌ఫాం డెవలప్ చేశాం. ఇలా డెవలప్ చేసిన ప్లాట్‌ఫాం ఏ ఇండస్ట్రీయల్లోనైనా ఉపయోగించవచ్చు.'-భార్గవి, న్యాస్టా వ్యవస్థాపకురాలు
ఆమె నాట్యానికి నటరాజు మైమరిచాడు - వెండితెర ఎర్ర తివాచీ పరిచి మరీ స్వాగతం పలికింది
23 ఏళ్లకే లస్సీ డే కేఫ్ వ్యాపారం- యశ్వంత్ సక్సెస్ జర్నీ సాగిందిలా