Pension Distribution in AP : ఏపీలో ముమ్మరంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరుగుతోంది. రాష్ట్రంలో 63,77,943 మందికి గాను రూ.2717 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో 31నే ఈ కార్యక్రమం చేపట్టింది. జనవరి 1కి ముందే పేదల ఇళ్లల్లో పెన్షన్ డబ్బు ఉండాలని ఒక రోజు ముందుగానే దీనిని చేపట్టారు. 83.45 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తయింది. ఉదయం 10 గంటలకు సమయానికి 53,22,406 మందికి రూ.2256 కోట్లు పంపిణీ చేశారు.
లబ్ధిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్ చేసి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు పరిశీస్తున్నారు. ఇళ్ల వద్దే పెన్షన్లు ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని జియో ట్యాగింగ్ ద్వారా తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం జియో ట్యాగింగ్ విధానాన్ని తీసుకొచ్చింది.
మరోవైపు ప్రజాప్రతినిధులు ఇంటిటికీ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెల్లవారుజాము నుంచే స్థానిక అధికారులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్ అందించారు. ఈ సందర్భంగా ప్రతి నెలా పెన్షన్ అందుతుందా లేదా అని ఆయన అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ రెండో వార్డులో పర్యటించి పెన్షన్ అందజేశారు. వార్డులోని ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భర్త చనిపోయిన 15 రోజుల్లోనే వితంతులకు పెన్షన్ అందిస్తున్నామని అరిమిల్లి చెప్పారు.
NTR Bharosa Pension in AP : కృష్ణా జిల్లా గుడివాడలో స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 11 వార్డులో ఇంటింటికీ వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్పౌజ్ పింఛన్ అందించారు. ప్రజాసంక్షేమానికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందని రాము స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పెన్షన్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎనిమిదో వార్డులో తెలుగుదేశం ప్లోర్ లీడర్ శాఖమూరి స్వర్ణలత వార్డు సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు.