Pension Distribution in AP : రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల సంబరం హోరెత్తింది. సామాజిక భద్రత పింఛనుదారుల ఇంట పండుగ వాతావరణం వెల్లివిరిసింది. రాష్ట్రంలో పింఛన్ దారులకు గత నెల వరకు 3 వేల రూపాయల చొప్పున అందుతుండగా కొత్త ప్రభుత్వం ఒకేసారి 1000 పెంచి, 4 వేల రూపాయలు చేసింది. పైగా దాన్ని ఏప్రిల్ నెల నుంచే అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించి, మూడు నెలల బకాయిలు కలిపి 7 వేల రూపాయల చొప్పున అందించింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 18 రోజుల్లోనే కీలక హామీని నెరవేర్చింది. లబ్ధిదారుల మోముల్లో చిరునవ్వులు పూయించింది. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు తదితర వర్గాల వారు పింఛను సొమ్మును చూసి మురిసిపోయారు.
61.95 లక్షల మందికి పంపిణీ : గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛన్ల పంపిణీలో పాల్గొని లబ్ధిదారులకు నగదు అందించారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేశారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ పాల్గొన్నారు. పలుచోట్ల వారు వినూత్న రీతిలో పంపిణీ చేశారు. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భాగస్వాములయ్యారు. జులై 1వ తేదీ రాత్రి 10 గంటలకల్లా 95.05 శాతం అనగా 61.95 లక్షల మందికి పంపిణీ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మిగిలిన వారికి నేడు వారి ఇళ్ల వద్దే నగదు అందించనున్నారు.
ఉద్యోగులకు చంద్రబాబు అభినందనలు - వారిపై చర్యలు : రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఒకేరోజులో రికార్డు స్థాయిలో 95.05 శాతం పింఛన్లు పంపిణీ చేసిన అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఒక్క రోజులో ఇంత భారీ స్థాయిలో పించన్ల పంపిణీ జరగలేదని పేర్కొన్నారు. సమర్థ నాయకత్వం ఉంటే ఉద్యోగులు ఎంత అద్భుతంగా పని చేయగలరనేది పింఛన్ల పంపిణీతో మరోసారి రుజువైందన్నారు.
పంపిణీలో పాల్గొన్న ప్రతి ఉద్యోగికి సీఎం అభినందనలు తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చడంలో ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ప్రభుత్వానికి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో కొన్ని చోట్ల సచివాలయ ఉద్యోగులు చేతివాటాన్ని ప్రదర్శించారు. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రూ.7 వేల పింఛను అందిస్తుండటంతో కొంత మొత్తాన్ని మినహాయించుకునేందుకు ప్రయత్నించారు. దీనిపై పింఛనుదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పింఛన్ల పండుగ - స్వయంగా పంపిణీ చేసిన నేతలు - pension distribution in ap
ఉద్యోగులు ఎంత అద్భుతంగా పని చేస్తారో చెప్పేందుకు ఇదే ఉదాహరణ : కూటమి ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంగా అందరూ భావిస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నా గతంలో ఎన్నడూ ఇంత వేగంగా జరగని పింఛన్ల పంపిణీ కూటమి ప్రభుత్వం సారథ్యంలో 1.30 లక్షల మంది సచివాలయం ఉద్యోగులతో రికార్డు స్థాయిలో పంపిణీ చేయడం విశేషమని, సమర్థ నాయకత్వం ఉంటే అధికారులు, ఉద్యోగులు ఎంత అద్భుతంగా పని చేస్తారో చెప్పేందుకు ఇదే ఉదాహరణ అని ఆయన కొనియాడారు.