ఒకటో తేదీ తెల్లవారున ఆరు గంటలకే పెంచిన పింఛను రూ.4000 ఇంటి వద్దే అందుకున్న అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులే మా కూటమి ప్రభుత్వానికి దీవెనలు. పింఛన్లు అందుకున్న వితంతువులు, దివ్యాంగులు చెబుతున్న కృతజ్ఞతలే మాకు ఆశీస్సులు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకున్న లక్షలాది మంది వ్యక్తం చేసిన… pic.twitter.com/XALIInDSyM
— Lokesh Nara (@naralokesh) August 1, 2024
NTR Bharosa Pension Distribution in AP: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ దాదాపు పూర్తయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 96 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. తొలి రోజునే 96 శాతం పెన్షన్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఒక్క రోజులోనే పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల ద్వారా ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేపట్టింది. సాయంత్రం 4 గంటల సమయానికి 96 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయ్యింది.
మిగిలిన నాలుగు శాతం పెన్షన్ల పంపిణీని పూర్తి చేసేలా సచివాలయ ఉద్యోగుల ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లా, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో పెన్షన్ల పంపిణీ జరిగింది. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు నేరుగా పాల్గొన్నారు.
మూడు గంటలలోనే రికార్డు: ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించగా, 9 గంటలు అయ్యేసరికి 71 శాతం పూర్తయింది. రికార్డు స్థాయిలో కేవలం 3 గంటలలోనే సగానికిపైగా పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పింఛన్లను పంపిణీ చేయటంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు: పింఛన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వివిధ గ్రామాలలో పింఛన్ పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో పింఛను పెంచేందుకు ఐదు సంవత్సరాలు పట్టిందని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్నామని తెలిపారు. రానున్న కాలంలో అర్హులందరికీ పెన్షన్ ఇవ్వడంతో పాటు, అనర్హులను పక్కన పెట్టే కార్యక్రమం కూడా చేపడతామని మంత్రి తెలిపారు.
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. పెన్షన్లు తీసుకున్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడుని దేవుడిగా కొలుస్తున్నారని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మంత్రి పొంగూరు నారాయణ ఫించన్లు పంపిణీ చేశారు. ఆప్యాయంగా పలకరించి ఫించను నగదును అందచేశారు. అవ్వాతాత కళ్లల్లో ఆనందం చూస్తున్నాం అని అన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. లబ్ధిదారులతో మంత్రి మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ఇంటింటికి వెళ్లి పింఛన్లను మంత్రి రామనారాయణరెడ్డి పంపిణీ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్లను ఒకటో తేదీనే ఇంటికి అందిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు.
పండగలా పింఛన్ల పంపిణీ - మొదటి రోజే అందరికీ అందించేలా చర్యలు - Pension Distribution in AP
అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించిందన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు.
Minister Lokesh Tweet: ఒకటో తేదీన తెల్లవారి ఆరు గంటలకే పెంచిన పింఛను 4 వేల రూపాయలను ఇంటి వద్దే అందుకున్న అవ్వాతాతల చిరునవ్వులే తమ కూటమి ప్రభుత్వానికి దీవెనలని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పింఛన్లు అందుకున్న వితంతువులు, దివ్యాంగులు చెబుతున్న కృతజ్ఞతలే తమకు ఆశీస్సులన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకున్న లక్షలాదిమంది వ్యక్తం చేసిన ఆనందమే కూటమి ప్రభుత్వానికి అందిన వెలకట్టలేని బహుమానమని లోకేశ్ ట్వీట్ చేశారు.