THEFT GANGS IN HYDERABAD : భార్యాభర్తలిద్దరూ అపరిచితులుగా వాహనాల్లోకి చేరి మన పక్కనే కూర్చుంటారు. అనుమానం రాకుండా విలువైన వస్తువులు కొట్టేసి క్షణాల్లో మాయమవుతారు. నగరంలో అంతర్రాష్ట్ర ముఠాలు ఎవరికి అనుమానం రాకుండా ప్రయాణికుల దృష్టిమరల్చి చోరీలకు పాల్పడుతున్నాయి. ఆటోలు, సిటీబస్సులు, రైళ్లల్లో హల్‌చల్ చేస్తున్నారు. దోపిడీ చేసిన సొమ్మును రిసీవర్లకిచ్చి నగరం దాటిస్తున్నారు. పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా కేటుగాళ్లను గుర్తించే పనిలో పడ్డారు.
శివార్లలో నివాసం : మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్లడానికి ఓ ప్రైవేటు ఉద్యోగి సిటీబస్సు ఎక్కాడు. టోలిచౌకి వద్ద ఇద్దరు యువకులు బస్సులోకి ఎక్కారు. షేక్‌పేట్ దర్గా వద్దకు చేరగానే బస్సు నుంచి ఆ ఇద్దరూ దిగిపోయారు. గచ్చిబౌలిలో దిగిన ఆ ఉద్యోగి తన పాకెట్లోని పర్సు, మెడలో గొలుసు మాయమైనట్టు గుర్తించాడు. బేగంపేట్ వద్ద ఆటోలో ప్రయాణించిన భార్యాభర్తలు తన వస్తువులను చోరీ చేసినట్లు ఆటోడ్రైవర్ గుర్తించి ఫిర్యాదు చేశాడు.
దిల్లీ, ఏపీ, హైదరాబాద్ ముఠాలు రెప్పపాటులో ఖరీదైన వస్తువులు దోచేసీ మాయమవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఏపీలోని సత్తెనపల్లి, బాపట్ల, నగరంలోని మాంగార్‌బస్తీలకు చెందిన మహిళలు, పురుషులు ముఠాలుగా మారి ఇలా చేస్తున్నట్టు అంచనా. యూపీ, ఏపీ, తమిళనాడుకు చెందిన ముఠాలు నగర శివారు ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకుంటారు. పగటి వేళల్లో ప్రయాణికుల్లా మెట్రోరైళ్లు, బస్సులు, ఎంఎంటీఎస్ రద్దీ ప్రాంతాల్లోకి చేరతారు.
కొట్టేయడంలో స్టైలే వేరు : తమిళనాడుకు చెందిన ముఠాలు ట్రాఫిక్ కూడళ్లు, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలను ఎంచుకుంటాయి. టైర్లలో గాలిపోయిందని, ఒంటిపై ఉమ్మిపడిందని దృష్టిని ఏమార్చి వస్తువులు దోచేస్తారు. ఏపీకి చెందిన ముఠాలు గృహిణులు, చిరువ్యాపారులను లక్ష్యంగా చేసుకుంటారు. తవ్వకాల్లో బంగారపు కడ్డీలు దొరికాయని అతి తక్కువ ధరకు ఇస్తామంటూ గాలం వేసి మోసగిస్తారు.
యూపీ బ్యాచ్ ప్రయాణికులుగా నటిస్తూ లూటీ చేస్తారు. దిల్లీ ముఠాలు డబ్బును ఎరగా వేస్తారు. తమ వద్ద విదేశీ కరెన్సీ ఉందని ఆశచూపుతారు. నగరంలో ఈ తరహా ముఠాలు సుమారు 10 మందికి పైగా మోసగించినట్టు సమాచారం. ప్రజారవాణా, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించేటపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఈ పాఠాల పరమార్థం వేరు - నగరంలో నేర ముఠాల నయా ఎత్తుగడలు - Thefts in Hyderabad