Nomination Process For AP Elections: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16 తేదీన ఏపీ శాసనసభ, లోక్ సభ ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
ఏపీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18 తేదీ నుంచి నామినేషన్ల ప్రారంభం కానుంది. మే 13 తేదీన ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరుగనుంది. జూన్ 4 తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగోవిడతలో జరుగనున్న ఏపీ శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18 తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 25 తేదీ వరకూ నామినేషన్లు దాఖలు చేసేందుకు తుదిగడువుగా ఈసీ ప్రకటించింది. 26 తేదీన నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. అలాగే 29 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా పేర్కోన్నారు.
రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ మే 13 తేదీన జరుగనుంది. జూన్ 4 తేదీన ఎన్నికల ఫలితాలను లెక్కించనున్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 ఎస్సీ, 7 ఎస్సీ స్థానాల్లో రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అటు 25 లోక్ సభ నియోజకవర్గాల్లో 4 ఎస్సీ రిజర్వుడు స్థానాలు, 1 ఎస్టీ రిజర్వుడు స్థానంలోనూ నామినేషన్లు రేపటి నుంచి స్వీకరించనున్నారు. అభ్యర్ధులు ఒక్కోక్కరు 4 సెట్ల వరకూ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. లోక్ సభ, శాసనసభ నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలుకు సంబంధించి 200 మంది రిటర్నింగ్ అధికారులను వేర్వేరుగా నియమించారు. నామినేషన్లకు 7 రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆలోగా దాఖలు చేసేందుకు రాజకీయ పార్టీలు సిద్ధం అవుతున్నాయి.
లోక్సభ ఎన్నికల తొలి దశ ప్రచారానికి తెర- తమిళనాడుపై ఫుల్ ఫోకస్! - Lok Sabha Election 2024
షెడ్యూలు విడుదల నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావటంతో రాజకీయ పార్టీలు, అభ్యర్ధులకు సంబంధించిన ఎన్నికల ప్రచారం, కోడ్ ఉల్లంఘనలు, ప్రచార వ్యయం, శాంతి భద్రతల అంశాలను ఈసీ ఆధినంలోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఎన్నికలను పర్యవేక్షించేందుకు ఈసీ 50 మంది సాధారణ అబ్జర్వర్లను, అలాగే 13 మంది పోలీసు అబ్జర్వర్లను నియమించింది. అలాగే 115 మంది ఎన్నికల వ్యయ పరిశీలకులను కూడా నియమించింది. వీరితో పాటు నేరుగా సీఈసీకి నివేదించేలా ఏపీకి ప్రత్యేకంగా సాధారణ, పోలీసు, వ్యయ పరిశీలకులను ముగ్గుర్ని ఎన్నికల సంఘం రాష్ట్రానికి పంపింది.