No Repair For Tatipudi Project in YSRCP Government : విజయనగరం జిల్లాలో సహజసిద్దంగా ఏర్పడిన ప్రాజెక్టు తాటిపూడి. ఈ జలాశయం కింద గజపతినగరం, జామి, శృంగవరపుకోట మండలాల పరిధిలో 20వేల ఎకరాల ఆయకట్టు ఉంది. విశాఖ, విజయనగరం సిటీలకు ఈ ప్రాజెక్టు నుంచే తాగునీరు వెళ్తోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచీ పూర్తి స్థాయి మరమ్మతులకు నోచుకోకపోవటంతో అధ్వాన్నంగా మారింది. ప్రధాన గేట్లు లీకులమయంగా మారాయి.
2011లో 29 కోట్ల రూపాయల జైకా నిధులతో తాటిపూడి ఆయకట్టు పనులు కొంతమేర జరిగాయి. నీరు-చెట్టు కార్యక్రమం కింద అప్పట్లో 19.8 లక్షల రూపాయలతో స్పిల్ వే మరమ్మతులు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కనీసం చిన్నపాటి పనులు కూడా నిర్వహించలేదు.
'ప్రాజెక్టు ప్రధాన కాల్వల పూడికతీత పనులు గాలికొదిలేయటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. బాణంగి నుంచి గోర్ధిమదుము వెళ్లే కాలువ, లంకోడి మదుము నుంచి వెళ్లే షేరీ కాలువ, ముఠా కాలువ నుంచి ఎద్దోడుమదుము వెళ్లే కాలువ పూడికతో నిండిపోయింది. వరదల సమయంలో పొలాల్లోకి నీళ్లు ప్రవహించి పంటలు దెబ్బతింటున్నాయి.' - వీర నాయుడు, ఎరిక నాయుడు, రైతులు
తాటిపూడిని పూర్తిస్థాయి సాగునీటి ప్రాజెక్టుగా మార్చాలని రైతులు కోరుతున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి విశాఖ నగరానికి జులై 1 నుంచి నవంబర్ ఆఖరు వరకు ప్రతిరోజూ 11 ఎంజీడీ నీరు తాగునీటి కోసం తరలిస్తున్నారు. ఖరీఫ్ సాగు సమయంలోనే ప్రాజెక్టు నుంచి విశాఖకు నీటి తరలింపు వల్ల ఆయకట్టుకు నీరందటం లేదని రైతులు చెబుతున్నారు.
తాటిపూడి ప్రాజెక్ట్ నుంచి ఖరీఫ్ సాగు కోసం నీటిని విడుదల చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వచ్చే ఖరీఫ్‌కు కాలువతో పాటు జలాశయం మరమ్మతులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే బొండపల్లి మండలంలోని ఎం.ఎన్. ఛానల్, బీపీ ఛానల్ మరమ్మతులకు నిధులు విడుదల చేశామని చెప్పారు. ప్రాజెక్టు సమర్థ నిర్వహణ, పంట కాల్వల మరమ్మతులతో పాటు జలాశయం వద్ద పర్యాటకాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపడతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
కృష్ణా నదీ జలాల వివాదం- అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను ఏ తీరాలకు చేర్చనుంది? - Krishna Water Dispute