Airport Establishment Delay in Nizamabad District : నిజామాబాద్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ఊరిస్తోంది. ఏళ్లుగా ఎయిర్‌పోర్ట్ వస్తుందని జిల్లా వాసులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. దశాబ్దంన్నర నుంచి అదిగో ఇదిగో అంటూ ప్రచారమే తప్ప పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. సర్వే జరిగినప్పుడు, బృందాలు పరిశీలనకు వచ్చినప్పుడల్లా జిల్లా వాసుల్లో ఆశలు పెరగడం, మళ్లీ పురోగతి లేక నిరాశ చెందడం షరా మామూలే అవుతోంది.
Nizamabad Airport Project Updates : వరంగల్ ఎయిర్‌పోర్ట్‌లో కదలిక వచ్చిన నేపథ్యంలో ఇందూరు విమానాశ్రయంపై జిల్లా వాసుల్లో మళ్లీ ఆశలు కలుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి వద్ద విమానాశ్రయం ఏర్పాటు గురించి ఆలోచన జరిగింది. 2013లో ఉడాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు.
రైతుల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత : మొదట జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు కోసం 2,000ల ఎకరాలు అవసరం అవుతుందని భావించారు. ఆ తర్వాత ఉడాన్ కింద డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ మాత్రమే నిర్మించేందుకు మొగ్గు చూపారు. దీంతో 1600 ఎకరాల భూమి అవసరం అవుతుందని భావించారు. ఇందులో కోలిప్యాక్, తొర్లికొండ, మనోహరాబాద్, అర్గుల్ ఈ ఐదు గ్రామాల శివారులో ప్రతిపాదిత స్థలం ఉంది. వీటిలో 1600 ఎకరాల్లో 1300 ఎకరాలు అసైన్ట్ భూములు ఉండగా, 300 ఎకరాలు పట్టా భూములు ఉన్నాయి. అయితే ఏళ్లకేళ్లు కాలయాపన జరుగుతుండటంతో వస్తుందో లేదోనన్న అనుమానంతో క్రమంగా రైతుల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
"15 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత పనులు ముందుకు సాగడం లేదు. అధికారులు పరిశీలనకు వచ్చినప్పుడు ఈ స్థలం బాగుందని చెబుతున్నారు. కానీ పనులు మొదలు పెట్టడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా విమానాశ్రయంపై దృష్టి పెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా దీనిపై దృష్టి పెట్టాలని కోరుతున్నాం. ఈ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే, మాతో పాటు పక్క జిల్లాలకూ ఉపయోగకరంగా ఉంటుంది." - స్థానికులు
44వ జాతీయ రహదారికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే విమానాశ్రయ ప్రతిపాదిత స్థలం ఉంది. నిజామాబాద్ చుట్టూ ఉన్న కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు సమీపంగా ఉంటుంది. దీంతో గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి ఎయిర్‌పోర్ట్ వస్తే ప్రయాణం సులువు అవుతుంది. అలాగే హైదరాబాద్‌కు కేవలం 170 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. ఇప్పటికైనా విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
వరంగల్ వాసులకు గుడ్న్యూస్ - విమానాశ్రయ నిర్మాణంలో ముందడుగు! - Warangal Airport Construction Issue
Adilabad Airport Delay : ఆదిలాబాద్లో ఎయిర్‌పోర్టు వస్తుందా.. రాదా..?