No Medical Services Available to People in Hilly Areas in Vijayawada : బెజవాడ కొండలపై ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు సర్కారు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నాయి. నగరంలో ఉన్న కొండ ప్రాంతాలన్నింటిలో దాదాపు రెండు లక్షల జనాభా నివసిస్తున్నారు. వీరిలో అధిక శాతం జనాభాకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో లేక వైద్య సేవలకు అవస్థలు పడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని వీరంతా వాపోతున్నారు.
విజయవాడలోని వన్ టౌన్, మొగల్రాజపురం, సొరంగ మార్గం, చిట్టి నగర్ కొండ ప్రాంతాల్లో అనేక మంది కొండలపై ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మరి కొందరు కొండ ప్రాంతాల్లో అద్దెకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది రోజు వారి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, చిన్న చిన్న పనులు చేసుకునే బడుగు జీవులే. వీరంతా అనారోగ్య సమస్యలు వస్తే సర్కార్ వైద్యం అందక సతమతమవుతున్నారు.
హార్ట్ ఎటాక్‌ను నిరోధించే కాప్స్యూల్ - బాపట్ల ఫార్మసీ కళాశాల బృందానికి పేటెంట్
చిట్టినగర్‌లోని ఆంజనేయవాగు కొండ ప్రాంతం, గుణదల సమీపంలోని గంగిరేద్దుల దిబ్బ కొండ ప్రాంతాల్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవి కొండ ప్రాంతంలో ఉండడంతో ప్రజలు వైద్య సదుపాయాలు అందుకోలేక పోతున్నారు. ఏదైనా అనారోగ్యానికి గురైతే రోగులు మెట్లు ఎక్కలేక నానా అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిని కొండ దిగువ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే తమకు సర్కారు వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుతాయని స్థానికులు కోరుతున్నారు.
మౌలిక వసతులు మరిచారు - ఎన్నికలొస్తున్నాయని ప్రారంభించేశారు
చిట్టినగర్‌లోని బాల భక్త సమాజం రోడ్డులో ఆస్పత్రికి కొత్త భవనం నిర్మిస్తామని గత కొన్నేళ్లుగా కాలయాపన చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దీనిపై పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న నాథుడే లేడని వాపోయారు. కొండ ప్రాంతాల్లో అందుబాటులో ఉండే విధంగా ఆస్పత్రి కోసం నూతన భవనం నిర్మిస్తే పేదలకు పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు అందే అవకాశం ఉంటుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి కొండ దిగువన ఆస్పత్రి భవనం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
ఫుడ్‌పాయిజన్‌తో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి - 21రోజులు వెంటిలేటర్‌పైనే