Farmers Facing Problems on Rythu Runa Mafi : నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అధికారుల నిర్లక్ష్యంతో రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. అన్నదాతలకు అండగా ఉండి న్యాయం చేయాల్సిన సొసైటీ సిబ్బంది, రుణాల వివరాలు నమోదు చేయడంలో అలసత్వం వహించారు. ఫలితంగా 156 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ అందలేదు. అన్ని అర్హతలు ఉన్నా అధికారుల నిర్లక్ష్యమే తమను నిండా ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
హనుమకొండ జిల్లా పరకాల పీఏసీఎస్‌లోని రైతుల పరిస్థితి మరో విధంగా ఉంది. రుణం ఒకసారే తీసుకున్నప్పటికీ ఒక్కో రైతు పేరు మీద రెండుమూడు సార్లు అప్పు తీసుకున్నట్లు నమోదు అయింది. అధికారుల అలసత్వమో, తప్పిదమో లేక కావాలనే చేశారో కానీ రైతులు లబోదిబోమంటున్నారు. తాము తీసుకోలేదని ఓవైపు మొరపెట్టుకుంటూనే రూ. 2 లక్షలు దాటడంతో రుణమాఫీకి అర్హత సాధించలేక పోతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
'గత తొమ్మిదో నెలలో లోన్ తీసుకున్నా. అయితే అధికారులు లోన్‌కు సంబంధించిన వివరాలు జనవరిలో నమోదు చేయడం వల్ల మాఫీ కాలేదు. అదే తొమ్మిదో నెలలోనే అధికారులు లోన్ నమోదు చేసి లిస్ట్ పంపిస్తే మాకు లోన్మాఫీ అయ్యేది. మా లిస్ట్ పంపించలేదు. అందుకే మాకు రుణమాఫీ కావడం లేదు. అడిగితే మూడో విడతలో అవుతుందని చెబుతున్నారు'-రైతులు
రుణాల వివరాలపై నిర్లక్ష్యం వహించిన అధికారులు : పరకాల సొసైటీలో 2018 వరకే రైతులకు రుణాలు ఇచ్చారని, అప్పటి నుంచి కొత్త అప్పులు ఇవ్వలేదని పీఏసీఎస్ ఛైర్మన్ నాగయ్య తెలిపారు. గతంలోనే తప్పిదాలు జరిగి ఉండొచ్చని వివరించారు. ఆధార్ కార్డు విషయంలో పొరపాట్లు జరిగాయని, అవకాశం ఉంటే సరిచేసి బాధితులకు న్యాయం చేస్తామని పీఏసీఎస్ సీఈఓ రమేశ్ తెలిపారు.
ఖాతాలో రూ.5 వేలు వేస్తేనే మాఫీ : వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బ్యాంకు అధికారుల వల్ల రైతులు అసౌకర్యానికి లోనవుతున్నారు. ఖాతాలో 5 వేల రూపాయలు నిల్వ ఉంటేనే మాఫీ మొత్తాన్ని ఇస్తామని బ్యాంకర్లు చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు నగదు జమ చేస్తున్నారు. అయితే, అవి వడ్డీ కోసమా ఎందుకనేదీ చెప్పట్లేదని అధికారుల తీరుతో ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు వివరిస్తున్నారు. షరతులు లేకుండా అర్హులందరికీ రుణవిముక్తి కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
రెండో విడత రైతు రుణమాఫీ - రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల సంబురాలు - Rythu Runa Mafi in Telangana