Engineering New Fees for 2025 : తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి బీటెక్‌తో పాటు ఫార్మసీ, మేనేజ్మెంట్ తదితర ఉన్నత విద్యా కోర్సులకు సంబంధించి కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ( టీఏఎఫ్‌ఆర్‌సీ) ప్రతి మూడేళ్లకు ఒకసారి ఫీజులను సమీక్షించి కొత్తవాటిని ఖరారు చేస్తుంది. ఈ మేరకు 2022-23, 2023-24, 2024-25 విద్యా సంవత్సరాలకు కమిటీ సిఫార్సుల మేరకు 2022 జులైలో కొత్త రుసుములను ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
New Fees For Academic Year 2025-26 : ఆ ఫీజులు ఈ అకాడమిక్ ఇయర్ (2024-25) వరకే వర్తిస్తాయి. 2025-26 నుంచి కొత్త రుసుములు అమల్లోకి రావాల్సి ఉంది. అందుకే టీఏఎఫ్‌ఆర్‌సీ ఛైర్మన్ జస్టిస్ ఎ.గోపాల్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఆచార్య శ్రీరాం వెంకటేష్, ఉన్నత విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి హరిత, జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ ఆచార్య కె.వెంకటేశ్వరరావు, ఓయూ రిజిస్ట్రార్ ఆచార్య లక్ష్మీనారాయణ తదితరులు సోమవారం సమావేశమై కొత్త మార్గదర్శకాలపై సమీక్షించారు.
ఆగస్టులో దరఖాస్తుల స్వీకరణ : ఈ నెలాఖరుకు టీఏఎఫ్‌ఆర్‌సీ నుంచి నోటిఫికేషన్ జారీ వెలువడనుంది. ఆగస్టు మొదటి లేదా రెండో వారం నుంచి ఆయా కళాశాలల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది. ఆయా కాలేజీలు గత 2-3 విద్యా సంవత్సరాల ఆదాయ, వ్యయాలను కమిటీకి సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం ఆయా కాలేజీల ప్రతినిధులను పిలిచి ప్రాథమికంగా నిర్ణయించిన ఫీజును తెలియజేస్తారు. ఏమైనా అభ్యంతరాలు చెబితే వాటిని పరిగణనలోకి తీసుకొని రుసుమును ఫైనల్ చేస్తారు.
ఆ రుసుముల వివరాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదానికి పంపిస్తారు. అనంతరం ప్రభుత్వం జీవో జారీచేస్తేనే కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి. సాధారణంగా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల ప్రారంభానికి ఒకట్రెండు రోజుల ముందుగా ఈ జీవోను జారీ చేస్తుంటారు. ప్రస్తుతం ఇంజినీరింగ్‌కు సంబంధించి గరిష్ఠంగా రూ.1.60 లక్షలు, కనిష్ఠంగా రూ.35 వేలు ఫీజుగా ఉంది.
పాలిటెక్నిక్ కోర్సులకూ : పాలిటెక్నిక్(డిప్లమో) కోర్సులకు గత దశాబ్దకాలంగా ఫీజులు పెంచలేదని, వాటిని పెంచాలని కోరుతూ గత విద్యా సంవత్సరంలో పలు కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దాంతో వాటికి కూడా టీఏఎఫ్‌ఆర్‌సీనే ఫీజులు నిర్ణయించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. అప్పటివరకు రూ.40 వేల రుసుము(ఫీజు) వసూలుకు కూడా అంగీకరించింది.
అయితే ఫీజులు ఖరారు చేయాలన్న ఆదేశాలు ప్రభుత్వం నుంచి రాకపోవడంతో కమిటీ సైతం మిన్నకుండిపోయింది. ప్రస్తుత అకాడమిక్ ఇయర్‌కు కూడా కదలిక లేదు. దాంతో హైకోర్టుకు వెళ్లిన పలు కళాశాలలు ఈసారి కూడా రూ.40 వేలు రుసుములను తీసుకుంటున్నాయి. అయితే కౌన్సెలింగ్ వెబ్‌సైట్లో మాత్రం అన్ని ప్రైవేట్ కళాశాలలకు రూ.15,780 మాత్రమే ఫీజు ఉన్నట్లుగా చూపుతున్నారు.
విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న కళాశాలలు : మిగిలిన మొత్తాన్ని ఆయా కాలేజీలు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. కొత్తగా టీఏఎఫ్‌ఆర్‌సీ నోటిఫికేషన్ జారీచేస్తున్న నేపథ్యంలో ఈసారి పాలిటెక్నిక్ కాలేజీలను కూడా చేర్చే అవకాశం కనిపిస్తోంది. ప్రతి విద్యా సంవత్సరం మొదట పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు ఆ కళాశాలలకు ఫీజులు నిర్ణయించే అవకాశముందని తెలుస్తోంది.
మోయలేని భారంగా మారిన ప్రైవేట్ చదువులు - ఫీజుల నియంత్రణ ఎలా ?