NDRF Special Training Indian Red Cross Society Staff : ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లో బాధితుల్ని రక్షించటంపై ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సిబ్బంది ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వైద్యం, సామాజిక సేవలందించే రెడ్‌క్రాస్ సభ్యులు విపత్తుల సమయంలో అందించే సహాయ చర్యలపై దృష్టి పెట్టారు. ఎక్కడైనా అనుకోని ప్రకృతి విపత్తులు సంభవిస్తే వెంటనే ఆ ప్రాంతాలకు వెళ్లి బాధితులను రక్షించే మెళకువలు నేర్చుకుంటున్నారు. ఈ శిక్షణను అన్ని ప్రాంతాల్లో అందించే విధంగా త్వరలో చర్యలు తీసుకుంటామని రెడ్‌క్రాస్ ప్రతినిధులు చెబుతున్నారు.
వైద్యం, రక్తదానం, సామాజిక సేవలందించే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది ఓ అడుగు ముందుకు వేశారు. విపత్తుల సమయంలో బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు ఏ విధంగా చేపట్టాలో శిక్షణ తీసుకుంటున్నారు. రెడ్‌క్రాస్ ప్రతినిధులకు NDRF సిబ్బంది ప్రత్యేక శిక్షణనిస్తున్నారు.
భవనాలు కూలినప్పుడు, వరదల్లో గ్రామాలు మునిగి నీటిలో చిక్కుకున్న బాధితులను రక్షించే సహాయ చర్యలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వివరించారు. అనంతరం కృష్ణా నదిలో స్పీడ్ బోట్లపై మాక్‌డ్రిల్‌తో క్షేత్రస్థాయి శిక్షణ ఇచ్చారు. భవనాల శిథిలాల్లో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలనేది డెమో చేసి చూపించారు. విద్యుత్ షాక్, అగ్ని ప్రమాదాలకు గురైనపుడు గుండె ఆగిపోతే సీపీఆర్ (CPR) చేసి ప్రాణాలు ఏవిధంగా రక్షించాలో శిక్షణనిచ్చారు.- ప్రదీప్ కుమార్, ఎన్డీఆర్ఎఫ్ ఇన్‌స్పెక్టర్
రెడ్‌క్రాస్ వాలంటీర్లకు 2 గంటలు శిక్షణనిచ్చాం. విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్వంలో రెడ్‌క్రాస్ వాలంటీర్లకు శిక్షణ ఇచ్చాం. ప్రమాదంలో ఉన్నవారి ప్రాణాలు ఎలా రక్షించాలనే అంశంపై మెళకువలు నేర్పించాం. సీపీఆర్ ఎలా చేయాలి వరదల్లో ఉన్న వారిని ఎలా కాపాడాలో వివరించాం. -రవి, ఎన్డీఆర్ఎఫ్ ఎస్సై
సాధారణంగా రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది వైద్య సేవలు అందిస్తుంటారు. విపత్తుల్లో ఉన్న వారిని రక్షించడానికి ప్రత్యేకంగా 10బృందాలు ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇప్పిస్తున్నామని రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ (NTR) జిల్లా ఛైర్మన్ డాక్టర్ సమరం తెలిపారు. ఒక్కొక్క బృందంలో 10మంది వాలంటీర్లు ఉంటారని, వారికి విడతల వారీ శిక్షణ ఇస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తరహా శిక్షణనిస్తామని సమరం వెల్లడించారు. ప్రమాదం సంభవించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని రక్షించడమే తమ లక్ష్యమని రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు అంటున్నారు.
కాపర్ మైన్‌లో చిక్కుకున్న కార్మికులు- 14 మంది సేఫ్, ఒకరు మృతి - Rajasthan Lift Collapse News