NDRF Rescue Lots of People in Vijayawada : కనుచూపు మేరలో ఎటు చూసినా అఖండ ప్రవాహం. గ్రామాలను ముంచెత్తుతూ వేరు చేస్తూ ప్రవహిస్తోన్న వరద. రోడ్లను ధ్వంసం చేసుకుంటూ, విధ్వంసం సృష్టిస్తూ వెళ్తోన్న ఉద్దృత ప్రవాహం. చుట్టూ నీరు చుట్టుముట్టడంతో గ్రామాలన్నీ ద్వీపాలు కాగా ప్రపంచంతో సంబంధాలూ తెగిపోయిన పరిస్దితి. కాలు బయటకు పెడితే ఎక్కడ కొట్టుకుపోతామో తెలియని రీతిలో ప్రవాహం ఇదీ. గండ్లు పడటంతో ఎన్టీఆర్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఉద్దృతంగా పొంగి పొర్లిన బుడమేరు కాలువ. నదిని సైతం తలదన్నేలా బుడమేరు కాల్వ ఉప్పొంగడంతో విజయవాడ రూరల్ మండలంలో గ్రామాలన్నీ జలదిగ్భందంలో చిక్కుకుని కకావికళమయ్యాయి.
పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు : ఈనెల 1న ఆదివారం ఉదయం బుడమేరు కాలువకు ఎగువన గండ్లు పడటంతో ఉద్ధృతంగా వచ్చిన వరద గ్రామాలను ఒక్కసారిగా ముంచెత్తింది. అకస్మాత్తుగా ఇళ్లు నీట మునగడంతో ఉన్నపలంగా ఉరుకులు పరుగులతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లి జనం తలదాచుకున్నారు. పొరుగు గ్రామాల మధ్య రహదారులన్నీ ధ్వంసమై కొట్టుకుపోగా ప్రవాహం అంతకంతకూ పెరిగి ఉద్దృతమై పలువురు ప్రాణాలు తీసిన దుస్ధితి. దీంతో గుంటుపల్లి, నుంచి రాయనపాడు, పైడూరు పాడు, ఈలప్రోలు, కవులూరు తదితర గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రాయనపాడు - పైడూరు పాడు మధ్య బుడమేరు ఉద్ధృతంగా పొంగిపొర్లుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. గ్రామంలోని రోడ్లను దాటేందుకు సాహసం చేయలేని పరిస్ధితి.
విజయవాడలో హెలికాప్టర్ల ద్వారా వరద ప్రాంతాల్లో ఆహారం పంపిణీ - Food distribution With Helicopters
ప్రాణాలను పణంగా పెట్టిన ఎన్డీఆర్ఎఫ్ : జనం ఆకలి, దప్పికలతో హాహా కారాలు చేస్తోన్న పరిస్ధితుల్లో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వేలాది మంది ప్రాణాలు నిలబెట్టాయి. అత్యంత ప్రమాదకర రీతిలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న బుడమేరు కాలువపై బోట్ల సహాయంతో అడ్డంగా వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వేలాది మంది ప్రజలకు ఆహారాన్ని అందించాయి. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుని ఆహారం సహా తాగునీరు అందించడం సహా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సహాయకంగా స్థానిక పోలీసు ఉన్నతాధికారులను నియమించడంతో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా చేయగలిగారు. ప్రాణాలను లెక్కచేయకుండా అత్యంత సాహసోపేతంగా ప్రవాహానికి అడ్డంగా వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ -13 బెటాలియన్ టీంలోని దళాలు ప్రజల ప్రాణాలను కాపాడారు. నాలుగు రోజుల్లో రాయనపాడు, పైడూరుపాడు, ఈలప్రోలు గ్రామాల్లోని వేలాది మంది ప్రజలకు ఆహారాన్ని, నీటిని అందించి ఆకలి దప్పికలను తీర్చారు.
ప్రత్యక్ష దైవం ఎన్డీఆర్ఎఫ్ : రాయనపాడు , పైడూరు పాడు, ఈలప్రోలు, కవులూరు గ్రామాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోగా ఉద్దృతంగా ప్రవహిస్తోన్న ప్రవాహం మీదుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సాహసాలే చేశారు. వరద ఉద్దృతికి ఓ వైపు బోట్లు దిగువకు కొట్టుకు పోతున్నా ఏ మాత్రం సహాయ కార్యక్రమాలు ఆపలేదు. ప్రమాదకర పరిస్ధితుల్లోనూ సాహసోపేతంగా ప్రవాహాన్ని దాటి పలువురు ప్రాణాలను కాపాడారు. గ్రామాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలను సురక్షితంగా ప్రవాహాన్ని దాటించి ఆస్పత్రులకు తరలించారు. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటోన్న పలువురు రోగులనూ పడవల్లో తరలించారు.
వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు. ఇలా ఆపత్కాలంలో ఉన్న వారందరికీ ఆపన్నహస్తాన్ని అందించాయి. 5 గ్రామాలకు సహాయ సహకారాల కోసం రాష్ట్ర ప్రభుత్వం డ్వామా పీడీ ఉన్న సునీతను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించింది. ఎసీపీని నియమించింది. రెవెన్యూ, పంచాయతీరాజ్, తదితర విభాగాల సిబ్బంది సహకారంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేసిన సహాయ సహకారాలు చూసి గ్రామస్తులు చేతులెత్తి దండం పెడుతున్నారు. తమ ప్రాణాలను రక్షించి ప్రత్యక్ష దైవంగా నిలిచారంటూ చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలిపారు.
సహాయక చర్యలు ముమ్మరం- వరద బాధితులకు ఆహార ప్యాకెట్ల పంపిణీ - Flood relief operations in ap
ప్రజల ప్రాణాలు కాపాడటమే మా కర్తవ్యం : వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందించిన సేవలను స్థానిక అధికారులు కొనియాడారు. వారు లేకుంటే గ్రామస్థులు చాలా మంది ప్రాణాలు కోల్పోయేవారంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించడం, అంతే వేగంగా కేంద్ర ప్రభుత్వం సైతం దళాలను రాష్ట్రానికి పంపడంతో ప్రాణాపాయం తప్పిందంటున్నారు. ఆయా గ్రామాల్లో ఎక్కడా మరణాల బారిన పడకపోవడానికి ఎన్డీఆర్ఎఫ్ దళాలే కారణమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం తమకు అన్ని విధాలా ఏర్పాట్లు చేసి సహాకారం అందించిందని, దీనివల్లే ఊహించని విపత్తు వచ్చినా ఎక్కడా ప్రాణా పాయం లేకుండా ప్రజలకు అన్ని రకాల సహాయ సహకారాలను సకాలంలో అందించగలిగామంటున్నారు.
ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమకు అప్పగించిన పనిని పూర్తి చేయడమే తమ లక్ష్యమని, ఆదిశగా ఎన్డీఆర్ఎఫ్ టీంలు పని చేస్తాయని ఎన్డీఆర్ఎఫ్-13 బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ తెలిపారు. రిస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా చేయడం, ప్రజలకు రక్షణ కల్పించడమే తమ లక్ష్యమన్నారు. అదే సమయంలో ఆయా గ్రామాల్లో ప్రజలు అనారోగ్యానికి గురైన సందర్భాల్లో వైద్య సేవలు అందకపోయినా తామే వైద్యం అందించి ప్రాణాలు కాపాడినట్లు బెటాలియన్‌లోని వైద్య నిపుణుుడు తెలిపారు. వరద పూర్తిగా తగ్గి గ్రామాల మధ్య రాకపోకలు యథాతథమై, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేవరకు సహాయక చర్యలు కొనసాగిస్తామని చెబుతున్నారు.
చేతులెత్తి నమస్కరించిన గ్రామస్థులు : ఎన్డీఆర్ఎఫ్ సేవలందించకపోతే తమ గ్రామాల్లో అపార నష్టం వాటిల్లేదని ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ రూరల్ మండలాల్లోని ముంపు గ్రామస్ధులు అభిప్రాయపడుతున్నారు. ఆత్మీయులే సాయం చేసేందుకు ముందుకు రాని పరిస్ధితుల్లో ఆపధ్బాంధవుల్లా వచ్చి తమ ఆకలి తీర్చారని, ప్రాణాలు సైతం కాపాడి అండగా నిలిచారంటూ వీరి సేవలకు చేతులెత్తి నమస్కరిస్తున్నారు.