Polavaram Project Files Burnt : అధికారం కోల్పోగానే కీలక శాఖల్లో ఫైల్స్ మంటలపాలు కావడం రివాజుగా మారింది. మొన్నటికి మొన్న మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో రెవెన్యూ శాఖకు సంబంధించిన దస్త్రాలు దహనం అయిపోయాయి. భూ అక్రమాలకు ఆధారాల్లేకుండా నిజాలకు నిప్పు పెట్టారు. ఆ ఘటనపై దర్యాప్తు సాగుతుండగానే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన దస్త్రాలు దగ్ధం కావడం కలకలం రేపుతోంది. వైఎస్సార్సీపీ నేతలు ఐదేళ్లలో చేసిన అక్రమాలు బయటకు వస్తాయనే భయంతో దస్త్రాలు తగలబెట్టారని జోరుగా ప్రచారం సాగుతోంది.
బాధ్యులను శిక్షించాలి : పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో దస్త్రాల దహనానికి కారకులను వదిలిపెట్టేది లేదని మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరించారు. కార్యాలయాన్ని సందర్శించిన ఆయన తగులబడిన దస్త్రాలను పరిశీలించారు. సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిరాక్స్ పేపర్లు తగులబెట్టినట్లు రాజమండ్రి ఆర్డీవో శివజ్యోతి ప్రకటించడంపై మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆనవాళ్లను మాయం చేస్తున్న దశలో ఇలాంటి ఘటనలు జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. దీనిపై విచారణ చేసి, బాధ్యులను శిక్షించాలని జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు దస్త్రాలు దగ్ధం - అధికారులే కాల్చేశారనే ఆరోపణలు - Polavaram Files Burnt
ప్రభుత్వం ఆలస్యం చేసింది : దస్త్రాలు కాల్చిన ప్రాంతాన్ని రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోలీసులతో కలిసి పరిశీలించారు. అక్కడ పూర్తిగా కాలిన పత్రాలను సీజ్ చేయాలని పోలీసులకు సూచించారు. సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న అధికారులను బదిలీ చేయకపోతే ఇలాంటి ఘటనలకే పాల్పడతారని, ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యం చేసిందని అన్నారు.
ఎంత పెద్దవారైనా శిక్షిస్తాం : వైఎస్సార్సీపీ అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయనే పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం దస్ర్తాలు దగ్ధం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. దీనికి బాధ్యలెవరో దర్యాప్తు ఎంత పెద్దవారైనా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తాం : తగులబడిన దస్త్రాలను జేసీ చిన్నరాముడు, ఎస్పీ నరసింహ కిశోర్ పరిశీలించారు. సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఘటనపై అధికారులు ఫిర్యాదు చేశారని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు.
చర్యలు తీసుకుంటాం : పోలవరం ఎడమ కాలవ సంబంధిత దస్త్రాలు దహనం కాలేదని ఆర్డీవో శివజ్యోతి తెలిపారు. జిరాక్స్ పేపర్లు, సంతకాలు లేనివి మాత్రమే దహనం చేశారని, అనుమతి లేకుండా ఎందుకు దహనం చేశారో విచారణ చేస్తామని వెల్లడించారు. ఇన్‌స్టిట్యూషన్ హెడ్ సంతకాలు లేవు కనుక అంత ముఖ్యమైనవి కావని అనుకుంటున్నామని అన్నారు. కార్యాలయానికి కొత్త బీరువాలు వచ్చాయని, దస్త్రాలు సర్దుకునే క్రమంలో అవసరం లేనివి కాల్చారని, అనుమతి లేకుండా దస్త్రాలు దహనం చేయడంపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.