NDA Leaders Election Campaign in AP: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అధికార వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అయిదేళ్ల జగన్ ప్రభుత్వంలో ప్రజాపాలన లేదని టీడీపీ నెల్లూరు నగర అభ్యర్థి నారాయణ విమర్శించారు. నెల్లూరు నగరంలోని తొమ్మిదో డివిజన్లో నారాయణ ప్రచారం నిర్వహించారు.
ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను తెలియజేశారు. జగన్ అధికారంలో ఉంటే రాష్ట్రంలో ఏ ఒక్కరికీ ఉద్యోగాలు రావని, ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోతాయని అన్నారు. చంద్రబాబు అధికారం చేపడితే రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, తద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని వెల్లడించారు. ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపిస్తే నెల్లూరును నెంబర్ వన్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్ పేట మండలంలోని గ్రామాల్లో ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆనంకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. వైసీపీ ఐదేళ్లగా వాలంటీర్లతో ఊడిగం చేయించుకొని ఎన్నికల సమయంలో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారని ఆనం ఆరోపించారు. వైసీపీ నాయకుల మాయ మాటలు నమ్మి వాలంటీర్లు వారి ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారని, వాలంటీర్లు ఎవరూ రాజీనామా చేయొద్దని సూచించారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10 వేల రూపాయలు జీతాన్ని అందజేస్తుందని హామీ ఇచ్చారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోడె ప్రసాద్ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కంకిపాడు మండలంలోని గొల్లగూడెం గ్రామంలో ప్రచార కార్యక్రమాన్ని బోడె ప్రసాద్ నిర్వహించారు. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానని, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. తను చేసిన అభివృద్ధిని చూసి ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ పతనం మొదలైందని ఎన్డీయే కూటమి ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ పట్టణం నాలుగో వార్డులో ఇంటింటికి వెళ్లి ఆమె సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. ప్రజలు కోరుకున్న పాలన అందించడమే కూటమి లక్ష్యమని పేర్కొన్నారు. జనసైనికులు, బీజేపీ కార్యకర్తలు, టీడీపీ సైన్యం వైసీపీని తరిమేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నియోజకవర్గంలో మునుపెన్నడూ లేనివిధంగా తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతోందని తంగిరాల సౌమ్య అన్నారు.
తెలుగుదేశంలోకి చేరికలు: చిత్తూరు ఎంపీగా తనను గెలిపిస్తే పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలంలోని శెట్టివానత్తం, చిన్నబాపనపల్లె పంచాయతీ పరిధిలో ఇంటింటి పర్యటన చేపట్టారు. ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాద్ రావు, పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి అమరనాథ రెడ్డి హాజరవడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో స్వాగతం పలికారు. శెట్టివానత్తం పంచాయతీకి చెందిన 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించడంతో ప్రసాదరావు, పలమనేరు అభ్యర్థి అమరనాథరెడ్డి వారికి కండువాలు వేసి ఆహ్వానించారు.
విస్తృతస్థాయి సమావేశం: ఈ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలు, రౌడీయిజం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, దీనిని ఎదుర్కోవడానికి ప్రజలంతా సంసిద్ధంగా ఉండాలని అనంతపురం అర్బన్ కూటమి అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతపురంలో అభ్యర్థి ప్రకటన తర్వాత తొలిసారిగా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని క్లస్టర్ల ఇన్ఛార్జిలు, బూత్ ఇన్ఛార్జిలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, పార్టీ పరిశీలకుడు రమణారెడ్డి హాజరయ్యారు.
వచ్చే ఎన్నికల్లో బెస్త కులస్తులందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని కర్నూలులో బెస్త కులస్తులు తెలిపారు. కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ఆధ్వర్యంలో బెస్తకులస్తులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో బెస్తకులస్తులు తెలుగుదేశం పార్టీలో చేరారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అయ్యప్ప నగర్ కాలనీ ఓటర్లతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాజధానిలేని రాష్ట్రంగా చేసి రాష్ట్రంలో అరాచక పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడటానికి కూటమినే గెలిపించాలని విజయవాడ తూర్పు శాసన సభ్యుడు గద్దె రామమోహన్ రావు విమర్శించారు.