NDA leaders campaign State Wide : రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. బాపట్ల జిల్లా శింగరకొండపాలెంలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఓట్లును అభ్యర్థించారు. రాష్ట్రంలో జగన్ రివర్స్ పాలన నడుస్తోందని ఒక్క హామీ అమలు చేయకుండా 95 హామీలు అమలు చేశామని జగన్ ఊదరగొడుతున్నారన్నారు. వారం రోజుల్లో రద్దు చేస్తాన్న సీపీఎస్ రద్దు ఏమైందని ప్రశ్నించారు. రికార్డులను మార్చి ఇళ్ల స్థలాలను కాజేసిన వైఎస్సార్సీపీ నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పే సమయం వచ్చిందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా రాట్నాలపల్లిలో కూటమి నాయకులతో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తమ విలువైన ఓటుతో అరాచక పాలనకు అంతం పలికి అభివృద్ధికి పాటుపడే నాయకులను గెలిపించాలని తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ కోరారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ ఇబ్రహీంపట్నంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మహిళలు హారతులు ఇచ్చి తిలకం దిద్ది స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి, పేదల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కృష్ణ ప్రసాద్ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. సూపర్ సిక్స్ పథకాల గురించి ఓటర్లను వివరించారు. మరోవైపు కృష్ణ ప్రసాద్ భార్య వసంత శిరీష జి.కొండూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానిక పార్టీ నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో స్థానిక మహిళలు తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ వ్యవహారాల్లో ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర కంటతడి పెట్టుకోవటం అందరి మనస్సును కదిలించిది.నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలం ఇస్కపల్లిలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని భారీ మెజారిటితో గెలిపించుకోవాలని కార్యకర్తలకు ఆయన పిలుపు నిచ్చారు.
వచ్చే ఎన్నికలు ధర్మం అధర్మానికి మధ్య జరిగే యుద్ధమని పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీ రత్న అన్నారు. రాష్ట్ర అస్థిత్వం పిల్లల భవితవ్యాన్ని నిర్దేశిస్తాయన్నారు. నారీ గళం కార్యక్రమంలో భాగంగా కూటమి మహిళా కార్యకర్తలతో శ్రీ రత్న సమావేశమయ్యారు. అరాచక వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే ఎలాంటి మేలు జరుగుతుందో ఓటర్లకు చెప్పాలని దిశానిర్దేశం చేశారు.
ఊరువాడా జోరుగా ఎన్డీఏ నేతల ఎన్నికల ప్రచారం - NDA LEADERS CAMPAIGN
వైయస్‌ఆర్ జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పట్టణంలోని 22వ వార్డులో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. వార్డులో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా బొబ్బిలిలో కూటమి అభ్యర్థి బేబీ నాయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. గిరిజన గ్రామాల్లో ప్రచార కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అన్ని వర్గాల ప్రజలు తనని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు డబ్బుతో ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బేబీ ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నిన బొబ్బిలి నియోజకవర్గంలో ఆటలు సాగవని తెలియజేశారు.