Pension Distribution in Andhra Pradesh : రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ రికార్డు స్థాయిలో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 గంటలకే ఫింఛన్ల పంపణీ ప్రారంభమైంది. ఇళ్ల వద్దే సచివాలయ సిబ్బంది ఫించన్ మొత్తం అందచేసే ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకల్లా 75 శాతం పైగా ఫింఛన్ల పంపిణీ పూర్తయ్యింది. రాష్ట్రంలో అవ్వతాతలకు రెండో పింఛన్ల పండగ జరుగుతోందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చెప్పారు.
అనంతపురంలోని 30వ డివిజన్ పరిధిలో ఇంటింటికి వెళ్లి ఆయన పెన్షన్లను పంపిణీ చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెన్షన్ల కోసం అవ్వ తాతలు ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి నెల ఒకటవ తేదీన ఉదయమే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం వల్లే పింఛను అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు చెప్పిన ప్రతి హామీని నెరవేర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు.
నెల్లూరు జిల్లాలో ఉదయం 6 గంటలకే ఫించన్లు పంపిణీ ప్రారంభం అయింది. నెల్లూరు 48వ డివిజన్ పొర్లుకట్ట ప్రాంతంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మంత్రి పొంగూరు నారాయణ ఫించన్లు పంపిణీ చేశారు. ఆప్యాయంగా పలకరించి రూ. 4వేల ఫించను నగదును అందచేశారు . అవ్వాతాత కళ్లల్లో ఆనందం చూస్తున్నాం అని అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి సూపర్ సిక్స్ పథకాలు ఇంటింటికీ అందించడమే టీడీపీ లక్ష్యమని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య యాదవ్ అన్నారు. చీరాలలో లబ్ధిదారులకు పింఛన్లు ఇంటింటికి పంపిణీ చేశారు. చీరాల పట్టణంలో 8,266 మంది లబ్ధిదారులకు 3 కోట్ల,49 లక్షల, 47 వేలరూపాయలు పింఛన్లు పంపిణీ చేశారు.
కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా పెన్షన్ల పంపిణీ సాగుతోంది. ఎమ్మిగనూరులో MLA బీవీ జయనాగేశ్వర రెడ్డి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించారు. కల్లూరు మండలం చిన్నటేకూరులో కలెక్టర్ రంజీత్ బాషా పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్లను 4వేల రూపాయలకు పెంచడంతో ఎంతో ఉపయోగపడుతుందని లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Pension Distribution IN satyasai District : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో పెన్షన్ల పంపిణీ జోరుగా సాగుతోంది. వెంకటరెడ్డి పల్లి, కురుబవాండ్లపల్లి గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. లబ్ధిదారులతో మంత్రి మాట్లాడారు. రెట్టింపు పింఛన్లు అందడంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లిలో కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో పెన్షన్ ప్రక్రియ నిర్వహించారు.
MLA In Pension Distribution : కృష్ణా జిల్లా కోడూరులో సామాజిక పెన్షన్లను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పంపిణీ చేశారు. కోడూరు 7,8,9 వార్డుల్లో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పెన్షన్లు అందించారు. పేదల కళ్లల్లో ఆనందం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం అశ్వరావుపాలెంలో గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ పద్మావతి పింఛన్లు పంపిణీ చేశారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా వృద్ధులు, వికలాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. వినుకొండలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే పింఛన్లు అందించారు. NTR జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు, మున్సిపాలిటీ ఉద్యోగుల ఆధ్వర్యంలో కూటమి నేతలుపెన్షన్లు అందిస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువులో వానను సైతం లెక్కచేయకుండా కలెక్టర్ పి. ప్రశాంతి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బొడ్డు వెంకట రమణ పాల్గొన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమానంగా జరుగుతున్నాయని చెప్పారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ రెండో నెల పంపిణీ కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఊడిమూడి గ్రామంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వేకువ జామునే సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా సామాజిక పింఛన్ల లబ్ధిదారులకు ఎలాంటి ఆలస్యం లేకుండా డబ్బులు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే సత్యనారాయణ లబ్ధిదారులకు వివరించారు.
కృష్ణా జిల్లాలో అత్యధికంగా 82శాతం మేర ఫింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 20శాతం మేర ఫింఛన్ల పంపిణీ జరిగింది. మొత్తం 64.82 లక్షల లబ్దిదారులకు గాను ఇప్పటి వరకు 41.26 లక్షల మందికి పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. లబ్దిదారులకు ఉదయం 6 గంటల నుంచి వారి ఇళ్ల వద్దే సచివాలయ ఉద్యోగులు ద్వారా 1739 కోట్లు పంపిణీ చేపట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండున్నర గంటల్లోనే దాదాపు 64 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి కావడం విశేషం.