NDA Government Focus on Suryalanka Beach : కూటమి ప్రభుత్వం సూర్యలంక పర్యాటక అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు కల్పించడానికి చర్యలు చేపట్టింది. వంద రోజుల ప్రణాళికలో సూర్యలంకను చేర్చింది. వసతుల కల్పనకు నిధులు మంజూరు కావడంతో సూర్యలంకకు మహర్దశ రానుంది. కేంద్రం రూ.100 కోట్ల నిధులు విడుదల చేయడంతో తీరానికి సమీపంలో పర్యాటక శాఖకు చెందిన ఎనిమిది ఎకరాల్లో కొత్త రిసార్ట్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. జల క్రీడలు, స్పీడ్ బోట్లు ఏర్పాటు చేసి పర్యాటకులకు అదనపు సౌకర్యాలు కల్పించనుంది.
బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ బాగా పేరు పొందిన బీచ్. వారాంతపు సెలవుల్లో వేల సంఖ్యలో ప్రజలు విహారానికి వచ్చి సంతోషంగా గడిపి వెళ్తున్నారు. కార్తీక మాసంలో పుణ్య స్నానాలు ఆచరించటానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. బాపట్ల ప్రగతికి పర్యాటక రంగం ఎంతో కీలకం. ఎంత ఎక్కువగా పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఆ మేరకు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనలో పర్యాటక రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. సూర్యలంకలో పర్యాటక రంగాభివృద్ధికి పైసా ఇవ్వలేదు. పర్యాటక శాఖ మంత్రులు వచ్చి సందర్శించి వెళ్లారు. 3 స్టార్ హోటల్ నిర్మిస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి వసతులు లేవు. అంతే కాకుండా టీడీపీ హయాంలో నిర్మించిన విశ్రాంతి గదులను కూల్చివేశారు.
'వంద రోజుల్లో వంద కోట్లు' - సూర్యలంక బీచ్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళిక - SURYALANKA BEACH
జిల్లాలో పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేస్తూ శింగరకొండ ఆంజనేయస్వామి ఆలయం, మోటుపల్లి ఆలయాలు, రామాపురం, వాడరేవు, సూర్యలంక బీచ్‌లు, నిజాంపట్నం హార్బరు, భట్టిప్రోలు బౌద్ధ స్తూపాన్ని పర్యాటకులు సందర్శించేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశాం. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో సూర్యలంకలో రిసార్ట్స్ నిర్మాణంతోపాటు మౌలిక వసతుల కల్పనకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించాం. - సురేష్, జిల్లా పర్యాటక శాఖాధికారి
పర్యాటకులకు వసతుల కల్పన ఇలా: బీచ్ వద్ద పర్యాటక శాఖకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. ప్రస్తుత రిసార్ట్స్‌లో ఉన్న 30 గదులు సరిపోవట్లేదు. వారాంతారల్లో గదుల కోసం నెల ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రగతికి కేంద్రం రూ. 400 కోట్లు మంజూరు చేయడంతో దీనిలో రూ. 100 కోట్లను సూర్యలంకకు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో బీచ్ వద్ద 8 ఎకరాల భూమిలో కొత్త రిసార్ట్ నిర్మాణాన్ని అధికారులు చేపట్టనున్నారు.
సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించాం: 2000లో నిర్మించిన పర్యాటక శాఖ బీచ్ రిసార్ట్స్ గదులు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం గదులను రూ.5 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. జల క్రీడలు, స్పీడ్ బోటింగ్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు జెట్‌స్కీలను కేటాయించగా కొత్తగా స్పీడ్ బోట్లు కూడా రానున్నాయి. పేరలి కాలువలో పడవల్లో విహారం ప్రాజెక్టు కార్యరూపం దాల్చనుంది. పడవల్లో మడ అడవులు, పొగురు ప్రాంతంలో ప్రకృతి రమణీయ దృశ్యాలు, విదేశాలు హిమాలయాల నుంచి వచ్చే వలస పక్షులను పర్యాటకులను తిలకించేలా ప్రణాళికలను అధికారులు రూపొందిస్తున్నారు.
బీచ్‌లో పెరుగుతున్న ప్రమాదాలు- పర్యాటకుల రాకపై పోలీసుల ఆంక్షలు - Temporarily Closed Bapatla Beach