Narayana Take Charge as Minister : ఏపీలో వీలైనంతగా త్వరగా అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం, రెండో బ్లాక్‌లోని ఛాంబర్లో పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉన్నతాధికారులు, సిబ్బంది సహా రాజధాని ప్రాంత రైతులు మంత్రికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి సమీక్ష అన్న క్యాంటీన్లపైనే చేశానన్నారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటు దిశగా త్వరగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. అక్షయపాత్ర ఫౌండేషన్‌కు భోజన సరఫరాపై పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
AP capital Amaravathi Construction : మూడు దశల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మించాలని గతంలో ప్రతిపాదనలు రూపొందించి అమలు చేశామన్న మంత్రి రాజధానిలో తొలి ఫేజ్ పనులకు రూ.48వేల కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. మూడు ఫేజుల్లో కలిపి రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి నిర్మాణం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో 48 వేల కోట్లతో అమరావతి కోసం టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టినట్లు తెలిపారు.
ప్రపంచంలో టాప్ టెన్ నగరాల్లో అమరావతి నిలిచేలా గతంలో పనులు చేశామని, చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా రాజధానిని నిర్మించినట్లు తెలిపారు. ఏ ఒక్క చిన్న లిటిగేషన్ లేకున్నా గత ప్రభుత్వం కేపిటల్ నిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపివేసిందని, భూములిచ్చిన రాజధాని రైతులను నిలువునా మోసం చేసిందన్నారు. మూడు రాజధానుల పేరు చెప్పి రాజధాని అమరావతిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని ఆక్షేపించారు.
రాజధానిలో రోడ్ల ధ్వంసం సహా దొంగతనాలపైనా కమిటీ : రాజధానిపై కోర్టుల్లో ఉన్న కేసులపై స్టడీ చేసి సానుకూలంగా తగిన చర్యలు తీసుకుంటామని, రాజధాని రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. రాజధానిలో మినిస్టర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాల నిర్మాణం దాదాపు పూర్తయిందని, రోడ్లు, డ్రైనేజీ సహా ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రాజధానిలో రోడ్ల ధ్వంసం సహా దొంగతనాలపైనా కమిటీ వేసి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
"అన్న క్యాంటీన్లపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించాం. అధ్యయనానికి అధికారులు 21 రోజులు సమయం కోరారు. అక్షయపాత్ర ఫౌండేషన్‌కు భోజన సరఫరాపై పరిశీలిస్తున్నాం. గతంలో చేసుకున్న ఒప్పందం, జీవోలను పరిశీలిస్తున్నాం. మూడు వారాల్లో ప్రారంభానికి సిద్ధమని ఫౌండేషన్ తెలిపింది. అన్నక్యాంటీన్లలో గత ప్రభుత్వం సచివాలయాలను ఏర్పాటు చేసింది. సచివాలయాలను ఇతర భవనాల్లోకి మార్చాలని ఆదేశించాం." - నారాయణ, మంత్రి
తనకు కేటాయించిన శాఖలపై మనసులో మాట చెప్పిన పవన్ - ఏమన్నారంటే?