Nara Brahmani Meet in IT Employees in Mangalagiri: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం ఎవరి హయాంలో బాగుందో ఆలోచించి ఓటు వేయాలని నారా బ్రాహ్మణి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలోని పై-కేర్ ఐటీ ఉద్యోగులతో బ్రాహ్మణి సమావేశమయ్యారు. ఐదు సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం ఐటీ ఉద్యోగులతో కళకళలాడేదని గుర్తు చేశారు.
తెలుగుదేశం హయాంలో ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు వస్తే వైసీపీ హయాంలో వాటిని తరిమేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వవైభవం రావాలంటే కూటమి ప్రభుతాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఐటీ కంపెనీలు తీసుకురావడానికి లోకేశ్ కృషి చేస్తారని తెలిపారు. మహిళలకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆమె మంగళగిరి నియోజకవర్గంలోని పలువురు మహిళలు, చేనేత కార్మికులను ఆమె కలిశారు.
కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని బ్రాహ్మణి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని నులకపేటలో స్త్రీశక్తి పథకం కింద కుట్టు శిక్షణ పొందిన మహిళలు, డ్వాక్రా సభ్యులతో ఆమె సమావేశమయ్యారు. మహిళాసాధికారతే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు, లోకేశ్ మహిళలను మహాశక్తిగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారన్నారు. మంగళగిరిలో లోకేశ్ అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం ద్వారా 2,610 మంది కుట్టు శిక్షణ తీసుకుని ఉపాధి పొందుతున్నారని, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళతామని వెల్లడించారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
పలకరిస్తూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ- ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి
లోకేశ్ మంగళగిరి ప్రజలను సొంత కుటుంబ సభ్యుల్లా భావించి సేవ చేస్తున్నారని తెలిపారు. ఆయన మాటల మనిషి కాదని చేతల మనిషి అని అన్నారు. ఆయన ప్రోత్సాహంతోనే పెళ్లైన తర్వాత తాను అమెరికా వెళ్లి ఉన్నత విద్య అభ్యసించానని, ఇప్పుడు హెరిటేజ్ పరిశ్రమ నడుపుతున్నానని తెలిపారు. మంగళగిరిని దేశంలోనే అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఆయన సంకల్పించారని, ప్రభుత్వ సహకారం లేకపోయినా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. నూతన వధూవరులకు పెళ్లికానుక, అన్న క్యాంటీన్, ఎన్టీఆర్ సంజీవని ఇలా పలు సేవలు అందిస్తున్నారన్నారు. చేనేత, స్వర్ణకారులు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు లోకేశ్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైతే మరెన్నో కార్యక్రమాలను పెద్ద స్థాయిలో అమలు చేస్తారని తెలిపారు.
మహిళలకు సహాయం చేసేందుకు చంద్రబాబు ఎప్పుడూ వెనుకాడరు: బ్రాహ్మణి - Brahmani Meet womens in Mangalagiri