Nara Bhuvaneswari Nijam Gelavali Yatra: రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. వైసీపీ అరాచక పాలన అంతం కావాలంటే సమష్టిగా ఏకం కావాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు. అందుకు ఓటు అనేదే ఆయుధమని ఆమె తెలిపారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నంద్యాలలో రెండో రోజు ఆమె పర్యటించారు.
నంద్యాల అంటే తనకు గుర్తుకొచ్చేది చంద్రబాబు అక్రమ అరెస్టే అని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ తప్పూ చేయకుండా, రుజువులు లేకుండా అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ముస్లింలను వైసీపీ ప్రభుత్వం వేధించిందని, వారి సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు.
ఇందులో భాగంగా నంద్యాల సమీపాన ఎస్.ఎన్. ఫంక్షన్ హాలులో ముస్లింలతో భువనేశ్వరి మాటామంతిలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే కాదు పేదలను సైతం వైసీపీ లక్ష్యంగా చేసుకుందని అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మహిళలు పలు సమస్యలను భువనేశ్వరికి వివరించారు.
పేద, బడుగు, బలహీనవర్గాల వారి కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, చంద్రబాబు సైతం ఎన్టీఆర్ మార్గంలోనే నడుస్తున్నారని నారా భువనేశ్వరి గుర్తు చేశారు. నంద్యాలకు చెందిన షేక్ అబ్దుల్ సలాం కుటుంబం వైసీపీ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. చదువుల్లో ఎంతో చురుగ్గా ఉండే మిస్బా అనే అమ్మాయి వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందన్నారు.
45 ఏళ్లు నిండిన మహిళలకు పెన్షన్లు ఇస్తామని చెప్పిన వైసీపీ నేటికీ అమలు చేయలేదన్నారు. ముస్లిం మహిళలకు దుల్హన్ పథకాన్ని రద్దు చేశారని, సబ్ ప్లాన్ అమలు చేస్తామని మాట తప్పారని, నూనెపల్లి గ్రామం 21వ వార్డులో రైల్వే ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని వివరించారు.
వక్ఫ్ బోర్డుకు చెందిన సుమారు 30 వేల ఎకరాలను వైసీపీ నేతలు కబ్జా చేశారని నారా భువనేశ్వరి ఆరోపించారు. ప్రార్థనా స్థలాలు, శ్మశాన స్థలాలను కూడా వైసీపీ నేతలు ఆక్రమించేస్తున్నారని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో నంద్యాలలో 13 వేల టిడ్కో ఇళ్లను కడితే వాటిని లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు. షరీఫ్‌ను శాసనమండలి ఛైర్మన్‌గా చేశారని చెప్పారు.
ఇమామ్‌లకు 5 వేలు, మౌజమ్‌లకు 3 వేలు గౌరవ వేతనం అందించిన ఘనత టీడీపీదేనని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. రంజాన్ తోఫా, దుల్హన్, దుకాన్-మకాన్ స్వయం ఉపాధి లోన్లు వంటి 10 పథకాలను చంద్రబాబు మైనారిటీలకు అందించారని, వైసీపీ ప్రభుత్వం ప్రతి పథకాన్ని రద్దు చేసి అన్యాయం చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏపీని గంజాయి, డ్రగ్స్, ఇసుక మాఫియా, భూకబ్జాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిందని, తాజాగా విశాఖలో 25 వేల కేజీల డ్రగ్స్ దొరికాయన్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తారని, వైసీపీ ప్రభుత్వానికి పేదవాళ్లకు పెన్షన్లు ఇవ్వడం చేతకాక ఆ నెపాన్ని చంద్రబాబు, టీడీపీపై నెట్టేసి ప్రజల్లో విష ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ కుట్రలను గమనించి రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టు తర్వాత మనస్తాపంతో చనిపోయినవారి కుటుంబాలకు పరామర్శించారు. కల్లూరులో నరసింహులు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ అండగా ఉంటుందని నరసింహులు కుటుంబానికి భువనేశ్వరి భరోసా ఇచ్చారు. జగన్‌ను ఇంటికి పంపించాలని, చంద్రబాబును గెలిపించాలని కోరారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని నారా భువనేశ్వరి తెలిపారు.